
ఈ నెలలో మార్కెట్ కమిటీలకు చైర్మన్లు
ఈ నెల 27లోగా రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల చైర్మన్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల, ఆలయ కమిటీల నామినేటెడ్
మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు
ఎల్లారెడ్డి: ఈ నెల 27లోగా రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల చైర్మన్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల, ఆలయ కమిటీల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం మంత్రి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని చెప్పారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి ఏనాడూ అన్యాయం జరగదన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు తప్పక లభిస్తాయన్నారు.
ప్రమాదవశాత్తూ చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ పూర్తి నిబద్ధతతో ఉన్నదన్నారు. ఇందుకు గాను రూ. ఐదున్నర కోట్లతో పార్టీ బీమా చేసిందన్నారు. ఇటీవల సాధారణ మృతి చెందిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఏడుగురు కార్యకర్తల కుటుంబాలకు మంత్రి రూ. రెండు లక్షల చొప్పున పార్టీ తరఫున అందించారు. అలాగే, ఆత్మహత్య చేసుకున్న గండిమాసానిపేట గ్రామానికి చెందిన రైతు కొడిపాక సాయిబాబా కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీఆర్‌ఎస్ మూడేళ్లు, ఐదేళ్ల పార్టీ కాదని ఇరవై ఏళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుందని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.