ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం పెంబీ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టు దళ సభ్యుడు చుంచుల బక్కన్న అలియాస్ శంకరన్నను పోలీసులు అరెస్టు చేశారు.
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం పెంబీ అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టు దళ సభ్యుడు చుంచుల బక్కన్న అలియాస్ శంకరన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బెల్లంపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషి బక్కన్న అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న మావోయిస్టుల కోసం పెంబీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు కొంతమంది మావోయిస్టు దళ సభ్యులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
కాల్పుల్లో బక్కన కుడి ఛాతిపై బుల్లెట్ గాయమైంది. అప్పటి నుంచి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఆదివారం తెల్లవారుజామున జన్నారం శివారు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న మావోయిస్టు నాయకులు ఆత్రం శోభన్ అలియాస్ చార్లెస్, బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా అలియాస్ క్రాంతి ఉరఫ్ ప్రభాత్, మల్లారపు అడేళ్లు అలియాస్ భాస్కర్, మరికొంత మందితో కలిసి అక్టోబర్ 30న తిర్యాణి మండలం మంగి గ్రామపంచాయతీ పరిధి కేరిగూడలో కుర్సింగ బల్లార్‌షాను ఇంట్లో నుంచి తీసుకెళ్లి పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారని తెలిపారు. ఈ ఘటనలో బక్కన్నకు ప్రత్యక్ష సంబంధం ఉందని స్పష్టం చేశారు. ఖానాపూర్, కడెం మండలాల్లో దళ సభ్యులతో కలిసి ఇదివరలో మావోయిస్టు వాల్‌పోస్టర్లను వేసిన సంఘటనలోనూ బక్కన్న పాల్గొన్నాడని వివరించారు. అజ్ఞాతంలోకి వెళ్లిన మావోయిస్టులు నిర్భయంగా ప్రభుత్వానికి లొంగిపోవాలని సూచించారు. బక్కన్నను జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపుతామని ఎస్పీ పేర్కొన్నారు.


