
కత్తిపోట్ల వెనుక ప్రేమ వ్యవహారం..!
కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో సోమవారం రాత్రి యువకుడిపై కత్తిపొట్లకు ప్రేమ వ్యవహరమే ప్రధాన కారణమని...
కరీంనగర్ క్రైం : కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో సోమవారం రాత్రి యువకుడిపై కత్తిపొట్లకు ప్రేమ వ్యవహరమే ప్రధాన కారణమని తెలుస్తోంది. బాధితుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓదెల మండలం గుండ్లపల్లికి చెందిన నందగిరి కుమరస్వామి-అనసూర్య దంపతులు జీవనోపాధి కోసం సీతారాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు రాజేంద్రప్రసాద్(19) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫ్యాషన్ గార్మెంట్ టెక్నాలజీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన రాజేంద్రప్రసాద్ సాయంత్రం ఇంటికి వచ్చి, ఇంటిలోనే ఉన్నాడు.
రాత్రి 8 గంటల సమయంలో కాలేజీలో అతడి సీనియర్లు అయిన దీక్షిత్, సాయికిరణ్ ఇంటికి వచ్చారు. రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి వెళ్లిపోయారు. మళ్లీ 9 గంటలకు వచ్చారు. రాజేంద్రప్రసాద్‌ను తీసుకుని ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు ఉన్నారు. ఈ క్రమంలో దీక్షిత్, సాయికిరణ్ రాజేంద్రప్రసాద్‌తో గొడవకు దిగారు. తాము చనువుగా ఉంటున్న అమ్మాయితో ఎందుకు చనువుగా ఉంటున్నావని, మరోసారి అమ్మాయితో మాట్లాడితే చంపుతానని బెదిరించారు.
రాజేంద్రప్రసాద్ కూడా సమాధానం చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన దీక్షిత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజేంద్రప్రసాద్‌పై దాడి చేశాడు. సాయికిరణ్‌తోపాటు మరో ముగ్గురు అతడికి సహకరించారు. కడుపులో పొడవడంతో రాజేంద్రప్రసాద్ అరుచుకుంటూ కిందిపడిపోయాడు. కొడుకు అరుపులు విన్న తల్లి అనసూర్య వెంటనే సంఘటన స్థలానికి పరిగెత్తింది. ఆమెను చూసిన నిందితులు పారిపోయారు. కుమారుడు రక్తమడుగులో కొట్టుకుంటూ కనిపించాడు. స్థానికుల సాయంతో వెంటనే 108కు, భర్తకు సమాచారం అందించింది.
108లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కరీంనగర్ రూరల్ ఎస్సై మాధవరావు, రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనసూర్య ఫిర్యాదు మేరకు దీక్షిత్, సాయికిరణ్‌తోపాటు మరో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, రాజేంద్రప్రసాద్ ఇప్పటికే రెండు శస్త్రచికిత్సలు చేశామని అతడి ఆరోగ్యం ఇంకా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.