ఐదేళ్లయినా అంతంతే! | Less IAS Officers Transfers In Telangana | Sakshi
Sakshi News home page

ఐదేళ్లయినా అంతంతే!

Jul 12 2019 1:31 AM | Updated on Jul 12 2019 4:50 AM

Less IAS Officers Transfers In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు గడిచినా రాష్ట్రాన్ని ఇంకా అఖిల భారత సర్వీసు అధికారుల కొరత వేధిస్తోంది. దీంతో ఉన్న ఐఏఎస్‌లకే అదనపు బాధ్యతలు అప్పగించడం లేదా నాన్‌ ఐఏఎస్‌లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కీలక ప్రభుత్వ శాఖల కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల్లో చాలా మంది రెండు, మూడు శాఖల ‘అదనపు’ బరువు బాధ్యతలతో సతమతమవుతున్నారు. తమ సొంత శాఖలో కింది స్థాయి అధికారులు, సిబ్బందికే సమయం కేటాయించలేకపోతున్నారు. అలాగే వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు సమయం కేటాయించలేకపోతున్నారు. గతేడాది జనవరిలో చివరిసారిగా భారీ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. అప్పట్లో పలువురు ఐఏఎస్‌లకు కేటాయించిన అదనపు బాధ్యతలను ప్రభుత్వం ఏడాదిన్నర తర్వాత కూడా కొనసాగిస్తుండటం గమనార్హం.

అవసరంకన్నా చాలా తక్కువ... 
రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలతోపాటు పాలనాపరంగా కలిపి మొత్తం 250 మంది వరకు ఐఏఎస్‌ అధికారుల అవసరం ఉంది. కానీ కేవలం 136 మంది మాత్రమే వివిధ శాఖల్లో ఉన్నతాధికారులుగా, జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి అనుమతిచ్చిన దానికన్నా ఇంకా 72 మంది తక్కువగా ఉన్నారు. ఏటా 10 మంది కంటే ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించడం లేదు. ఈ విషయమై కేంద్రానికి ఎన్నిసార్లు రాష్ట్రం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

అధికారులపై భారం... 
ఒకే అధికారికి కీలక బాధ్యతలను అప్పగించడంతో వారు దేనిపైనా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతోపాటు ఆయా అధికారులపై పనిభారం పెరుగుతోంది. అన్ని శాఖల్లో రోజువారీగా క్లియర్‌ చేయాల్సిన ఫైళ్లతోపాటు పలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫైళ్లు, ఆయా శాఖల్లో చేపట్టాలనుకునే కొత్త ప్రాజెక్టులు, పథకాలు, ఆయా శాఖలకు సంబంధించి కేంద్రంతో సమన్వయం లాంటివి ఐఏఎస్‌ అధికారులకు భారంగా మారుతోంది. రెవెన్యూశాఖకు గుండెకాయ లాంటి భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టు గత రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. సీనియర్‌ ఐఏస్‌లకు అదనపు బాధ్యతగా ఈ పోస్టును ప్రభుత్వం అప్పగించగా వారు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయారు. ఇన్‌చార్జి అధికారి పర్యవేక్షణలోనే భూ రికార్డుల ప్రక్షాళన లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం జరగడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులు, సిబ్బందిలో అధిక శాతం మంది లంచాలు లేకుండా ఏ పనీ చేయడం లేదని ఇటీవల కాలంలో ఆరోపణలు అధికమయ్యాయి. సీసీఎల్‌ఏ కమిషనర్‌ను నియమిస్తేనే క్షేత్రస్థాయిలో రెవెన్యూశాఖ గాడినపడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
 

జిల్లాల విభజనతో మరింత కొరత... 
గతంలో రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా 33 జిల్లాలకు పెంచడంతో ఐఏఎస్‌ల అవసరం మరింత పెరిగింది. జిల్లాలు చిన్నవి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో పరిపాలనను గాడినపెట్టడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వారిదే. సీనియర్‌ ఐఏఎస్‌లు అందుబాటులో లేకపోవడంతో చాలా జిల్లాల్లో జూనియర్‌ ఐఏఎస్‌లను ప్రభుత్వం కలెక్టర్లుగా నియమించి పాలనా బాధ్యతలు అప్పగించింది. కొందరు కలెక్టర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, అవగాహనలేమితో చిన్నచిన్న విషయాలనూ సచివాలయ అధికారులకే పంపుతున్నారు.

తెరపైకి తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌... 
ఐఏఎస్‌ల కొరతతోపాటు కేంద్రం కేటాయించే అధికారుల సంఖ్య కూడా తక్కువ కావడంతో సమస్యను అధిగమించేందుకు సీఎం కేసీఆర్‌ కొత్తగా తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (టీఏఎస్‌)ను ప్రతిపాదించారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌లతో కమిటీ వేశారు. గత మూడేళ్లలో పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ... ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక సమర్పించలేదు. అయితే టీఏఎస్‌ ప్రతిపాదనను రెవెన్యూ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో తమకు ఐఏఎస్‌ల పదోన్నతి అవకాశాలు గండిపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లతోపాటు ఇటీవల ఇటీవల ఐఏఎస్‌లుగా కన్ఫ్‌ర్డ్‌ అయిన 10 మంది అధికారులు కొత్త పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement