పోరాటాల గడ్డ తెలంగాణలో కమ్యూనిస్టులకు చుక్కెదురైంది. ప్రాదేశిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలను ఓటర్లు ఆదరించలేదు.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే పోటీ ఇచ్చిన వామపక్షాలు
సాక్షి, హైదరాబాద్: పోరాటాల గడ్డ తెలంగాణలో కమ్యూనిస్టులకు చుక్కెదురైంది. ప్రాదేశిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలను ఓటర్లు ఆదరించలేదు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పునరావృతం కావడంతో కామ్రేడ్లు డీలా పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టులు మూడు జెడ్పీటీసీలు, 214 ఎంపీటీసీలు గెలుపొందారు. తెలంగాణలోని మొత్తం పది జిల్లాలకు గాను ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాస్తోకూస్తో తప్పితే ఎక్కడా కనీస పోటీ ఇచ్చిన దాఖలా లేదు. రాష్ట్ర విభజనకు ముందుండి పోరాటం చేసిన సీపీఐని సైతం ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు దరి చేర్చుకోలేదు. మరోవైపు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వైఖరి తీసుకున్న సీపీఎం మాత్రం కాస్త ఉనికి చాటుకోగలిగింది. గత ప్రాదేశిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చిన కమ్యూనిస్టులు ఈ సారి ఉనికి కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. 2 పార్టీలు ఖమ్మంలో సంప్రదాయ పార్టీలతో కలిసి నామమాత్రపు సీట్లు దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ జిల్లాలోనే సీపీఐ, సీపీఎంలకు 3 జెడ్పీటీసీలు, 104 ఎంపీటీసీలు దక్కాయి.