ఇంకా మూడ్రోజులే..! 

Last Three Days For Alcohol Tender - Sakshi

‘మద్యం’లైసెన్స్‌ దరఖాస్తులకు16వ తేదీ ఆఖరు 

ఇప్పటివరకు 4 వేలకు పైగా దరఖాస్తులు.. 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం దుకాణాల నిర్వహణకు గాను టెండర్‌ దాఖలు చేసేందుకు మరో మూడ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16తో ముగియనున్న నేపథ్యంలో చివరి మూడ్రోజులు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొదటి 4 రోజుల్లో రాష్ట్రంలోని 2,216 షాపులకు గాను 4,326 దరఖాస్తులు వచ్చాయి. స్పందన బాగుందని, కొత్త ఔత్సాహికులు దరఖాస్తులు తీసుకుంటున్నారని, చివరి మూడ్రోజుల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు. గతంలో వచ్చిన 40 వేల దరఖాస్తులను మించి దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.

మద్యం వ్యాపారంలోకి కొత్త వ్యక్తులు 
మద్యం వ్యాపారంలో ఈసారి కొత్త వ్యక్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకూ మద్యం వ్యాపారం పరిధి పెరిగిపోతుండటం, దేశంలోనే ఎక్కువ మార్జిన్‌ను రిటైలర్లకు ప్రభుత్వం ఇస్తుండటంతో లాభాలు గడించవచ్చనే ఆలోచనతో ఈ వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో 23%మంది మద్యం తీసుకుంటున్నా రని అంచనా. ఈ వ్యాపారంలోకి కొత్తవారు రాకుం డా ఇప్పటికే లైసెన్సులున్న రిటైలర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం వ్యాపా రంలో ఉన్న కష్టాలను చెప్పుకుంటూ ఈ వ్యాపా రం అంత లాభసాటి కాదనే ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో జరుగుతోంది. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం దేశంలోనే ఇంత సులభమైన ఎక్సైజ్‌ పాలసీ మరొకటి లేదంటున్నారు.

హైదరాబాద్‌పై ‘ఆశలు’
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో కూడా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌ డివిజన్‌లో మొత్తం 173 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇప్పటివరకు 91 దరఖాస్తులు వచ్చాయి. తొలి నాలుగు రోజుల్లో గతంలో ఇన్ని దరఖాస్తులు ఎప్పుడూ రాలేదని ఎక్సైజ్‌ అధికారులు చెపుతున్నారు. ఎప్పుడూ చివరి రెండ్రోజులు, ముఖ్యంగా చివరిరోజు దరఖాస్తులు వెల్లువలా వస్తాయని చెబుతున్నారు. దాఖలైన దరఖాస్తులకు పదింతలు ఎక్కువ దరఖాస్తులు ఇప్పటికే తీసుకున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పరిధిలో మంచి స్పందన ఉంటుందని ఎక్సైజ్‌ అధికారులు ఆశలు పెట్టుకోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top