కేటీఆర్‌ సభ వాయిదా!

KTR Tour Postponed In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  టీఆర్‌ఎస్‌ అసంతృప్తులు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు కావొస్తున్నా పలు చోట్ల అసంతృప్తి చల్లారడం లేదు. ఒక వైపు తగ్గినట్లే తగ్గి... అనుచరుల ఒత్తిడితో మళ్లీ నిర్ణయాలు మార్చుకుంటున్నారు. ఈక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌తో ప్రచారానికి సంబంధించి ఏర్పాట్లు చేయగా.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వైఖరితో ఆ సభకు వాయిదా పడింది. ఈనెల 14న వెల్దండలో సభ జరగాల్సి ఉండగా.. ఎమ్మెల్సీని ఆహ్వానించినా ఆయన హాజరుకాబోనని వెల్లడించడంతో మొత్తానికి సభను వేశారు. అయితే, అనుచరుల ఒత్తిడితో రానున్న ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలో నిలవాలని కసిరెడ్డి నిర్ణయించుకున్నందునే ఈ సభకు వచ్చేది లేదని చెప్పినట్లు సమాచారం.

కొలిక్కి రాని కల్వకుర్తి 
టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అంశం ఎంతకూ ఓ కొలిక్కి రావడం లేదు. కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో ఇంతకాలం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పలుమార్లు మంత్రి కేటీఆర్‌ పలుమార్లు చర్చలు జరిపినా కొలిక్కి రావడం లేదు. మరోపక్క ఎన్నికల బరిలో ఖచ్చితంగా నిలవాల్సిందేనని కసిరెడ్డి అనుచరవర్గం పట్టుబడుతోంది. ప్రతీ మండలంలో కసిరెడ్డి అనుచరులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ బరిలో నిలవాల్సిందేనంటూ తీర్మానాలు చేస్తున్నారు.

ఇంతలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14న కల్వకుర్తి నియోజవర్గంలో సభ నిర్వహణకు మంత్రి కేటీఆర్‌ ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా సభా ఏర్పాట్లను చకచకా చేపట్టారు. అయితే ఈ సభకు హాజరు కావాల్సిందిగా స్వయంగా మంత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేసి కసిరెడ్డిని ఆహ్వానించారు. కానీ ఆయన మాత్రం సభకు హాజరుకాబోనని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో వెల్దండలో నిర్వహించాల్సిన ప్రచార సభను మంత్రి కేటీఆర్‌ రద్దు చేశారు.
  
ప్రచారానికి బ్రేక్‌ 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళిక రూపొందించింది. అందుకు అనుగుణంగా కేడర్‌లో జోష్‌ తగ్గకుండా ఉండేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతీ వారం పార్టీ ముఖ్యనేతలతో ఎక్కడో ఓ చోట సభలు ఉండేలా ప్రణాళిక తయారు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లో మంత్రి కేటీఆర్‌ సభ నిర్వహించగా... తర్వాత వారం స్వయంగా సీఎం కేసీఆర్‌ వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఇక ప్రణాళిక ప్రకారం ఈ వారం ఉమ్మడి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండలో సభ జరగాల్సి ఉండగా కసిరెడ్డి వ్యవహారం కారణంగా రద్దు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top