
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. నాలాల పూడికతీతకు మార్చి నాటికే డెడ్‌లైన్ విధించినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేటీఆర్, అధికారులపై మండిపడ్డారు. ఓ వైపు నగరంలో రోడ్లు తవ్వవద్దని చెబుతున్నా ఎందుకు తవ్వుతున్నారో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఎప్పుడో ఇచ్చిన అనుమతులను చూపించి ఇప్పటికీ వాటిని కొనసాగించడమేమిటంటూ ఇంజనీరింగ్ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనకు నగరంలోని రోడ్ల తవ్వకాలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులకు సమాధానం చెప్పాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా, రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని, గుంతలు ఇంకా ఎందుకున్నాయంటూ అధికారులను మంత్రి నిలదీశారు.