సీల్డ్‌ కవర్‌ సీఎం కావాలా ?

KTR Election Camping In  Warangal - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: మహాకూటమిగా చెప్పుకునే నేతలకు సీఎం అభ్యర్థి ఎవరో క్లారిటీ లేదని, ఢిల్లీ నుంచి సీల్డ్‌ కవర్‌లో వచ్చేవారు కావాలా, తెలం గాణ బిడ్డ అయిన సింహంలాంటి కేసీఆర్‌ కావా లా ప్రజలు తేల్చుకోవాలని ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. డివిజన్‌  కేంద్రంలోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, కోదండరాం పార్టీ, సీపీఐ కలిపి మహాకూటమి అంటున్నారని, వారిది దగా కూటమి అన్నారు. తెలంగాణ గోస తెలిసిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ కావాలా, ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్‌ కవర్‌తో కుర్చీలెక్కే దగుల్భాజీలు కావాలా అన్నారు. రైతులకు గోదావరి నీరు అందించాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే కుసంస్కారం, దరిద్రపుగొట్టు ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కోర్టులో 200 కేసులు వేసిందన్నారు.

60 ఏళ్లు పాలించి వారు రైతుల సమస్యలు పట్టించుకోలేదని, కేసీఆర్‌ రైతుల పాలిట దైవంగా పనిచేస్తుంటే అమ్మ పెట్టదు, అడక్క తిననివ్వదు అన్నట్లు ఉంది కాంగ్రెస్‌ వ్యవహారమని ఎద్దేవా చేశారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఏడు రిజర్వాయర్లు ఉన్నాయని, రానున్న రోజుల్లో లింగంపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంతో ఘన్‌పూర్‌ మరో కోనసీమగా మారుతుందన్నారు. సాధారణంగా పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య స్వల్ప బేధాభిప్రాయాలు ఉండొచ్చని, ఒక కుటుంబంలోనే పలు పొరపొచ్చాలుంటాయన్నారు. శత్రువు వచ్చినప్పుడు బేధాభిప్రాయాలను పక్కన పెట్టాలని, టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులంతా ఏకమై రానున్న ఎన్నికల్లో కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో డాక్టర్‌ రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌లో సమ్మతి, అసమ్మతి లేదు : కడియం శ్రీహరి
ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌లో సమ్మతి, అసమ్మతి ఏమీ లేవని, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులంతా టీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్నామని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తనను అభిమానించేవారు, తనపై గౌరవం ఉన్నవారంతా చిన్నచిన్న అభిప్రాయబేధాలుంటే పక్కన పెట్టాలని, రాజయ్య గెలుపునకు కంకణబద్ధులై పనిచేయాలన్నారు. రాజయ్య ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించినా, తాను ఎప్పుడు ప్రవర్తించలేదని, రాజయ్య తనకు తమ్ముడు లాంటివాడని ఉద్వేగంగా చెప్పారు. కాగా కడియం శ్రీహరి మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు సభకు వచ్చిన పార్టీ శ్రేణులు చప్పట్లు, ఈలలతో అభినందించడం విశేషం.
 
మా బాస్‌లు ఢిల్లీలో లేరు.. గల్లీలో ఉన్నారు: రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ 
సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా మన బాస్‌లు ఢిల్లీలో, అమరావతిలో లేరని, గ్రామాల్లో, గల్లీల్లో ఉన్నారని, వారే పార్టీ కార్యకర్తలు, ఓటర్లని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాష్‌ అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని, కొన్ని దుష్ట శక్తులు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలు పెట్టాలని గగ్గోలు పెడితే ముందస్తు ఎన్నికలు వచ్చాయన్నారు. 

సిద్ధిపేట తర్వాత దమ్మున్న నియోజకవర్గం ఘన్‌పూర్‌ :

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సిద్ధిపేట తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆ స్థాయిలో పట్టున్న, దమ్మున్న నియోజకవర్గం స్టేషన్‌ ఘన్‌పూర్‌ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఘన్‌పూర్‌ త్యాగాలకు ప్రతీకని, డాక్టర్‌ రాజయ్య ఆ రోజుల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా పట్టి ఉద్యమానికి ఊపు తెచ్చారన్నారు.

కడియం శ్రీహరి సహకారంతో అభివృద్ధి చేస్తా : డాక్టర్‌ రాజయ్య
ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే కడియం శ్రీహరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. తనకు తెలిసీతెలియక ఏమైనా తప్పులు జరిగి ఉంటే కడియం శ్రీహరి, పార్టీ శ్రేణులు మన్నించాలన్నారు. నియోజకవర్గమే దేవాలయమని, ప్రజలే దేవుళ్లన్నారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమల్లు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాలోత్‌ కవిత, సన్నపునేని రాజేందర్, వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, గాంధీనాయక్,  కొమురవెళ్లి దేవస్థాన చైర్మన్‌ సేవెళ్లి సంపత్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ అన్నం బ్రహ్మారెడ్డి, సీహెచ్‌.నరేందర్‌రెడ్డి, పోగుల సారంగపాణి, తోట వెంకన్నతో పాటు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top