58 సార్లు బెయిల్‌ రాకుండా చేశా..

kousalya Demand For Honor killing Justice - Sakshi

కులాంతర వివాహితులకు ప్రత్యేక చట్టం తేవాలి

నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష పడింది

భర్త పేరున ట్రస్టును ఏర్పాటు చేసి సేవలందిస్తున్నా..

తమిళనాడులో హత్యకు గురైన శంకర్‌ భార్య కౌసల్య

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజికవేత్త, తమిళనాడులో హత్యకు గురైన శంకర్‌ భార్య కౌసల్య డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ భార్య అమృత వర్షిణిని పరామర్శించిన ఆమె కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నేను ఒక దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టి నా తల్లిదండ్రులు, బంధువులు 2016 మార్చి 13న నా భర్త శంకర్‌ను హత్య చేశారని, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నా తలకు 36 కుట్లు పడ్డాయని చెప్పారు. నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేశానని, అందుకు జిల్లా కోర్టు నా తండ్రితోపాటు మరో ఐదుగురికి మరణ శిక్ష, ఒకరికి యావజ్జీవ కారగార శిక్ష విధించిందని చెప్పారు.

జిల్లా కోర్టు నా తండ్రికి రెండుసార్లు ఉరిశిక్ష వేయమని తీర్పునిచ్చిందని చెప్పారు. హైకోర్టుకు వెళ్లినా వారు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని చెప్పారు. నిందితులు 58 సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా రాకుండా చేశానని అన్నారు. ప్రభుత్వం నాకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు ముగ్గురు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ను నా తరపున వాదించేందుకు నియమించిందని చెప్పారు. నాభర్త పేరున శంకర్‌ సోషల్‌ జస్టిస్‌ ట్రస్టును ఏర్పాటు చేసి 30 మంది విద్యార్థులకు విద్యా సహాయం చేయడంతోపాటు వారికి డప్పులో శిక్షణ ఇస్తున్నానని, ప్రేమికులకు మద్దతు, రక్షణ కల్పించడంతోపాటు వారి వివాహానికి సహకారం అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రణయ్‌ భార్య అమృత వర్షిణికి పూర్తి రక్షణ కల్పించాలని ఆమెడిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ అధ్యక్షుడు కె.భాస్కర్, ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబాబు,కృపాసాగర్, దశరథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top