కరెంటు దక్కకుండా ఆంధ్రనేతల కుట్ర | Kodandaram speaks about Power issues | Sakshi
Sakshi News home page

కరెంటు దక్కకుండా ఆంధ్రనేతల కుట్ర

Oct 29 2014 2:15 AM | Updated on Jul 29 2019 2:51 PM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టు తెలంగాణకు దక్కాల్సిన వాటాలో విద్యుత్ దక్కి తీరాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.

* ఢిల్లీ బంధంతో నిజాలు  వెలుగు చూడనీయడం లేదు  
* ఇలా అయితే రాష్ట్ర సాధన కష్టం వృథాయే
 * బీజేపీ రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆవేదన
 * సౌర విద్యుత్తు, పొదుపుపై దృష్టి పెట్టాలి : నిపుణులు

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టు తెలంగాణకు దక్కాల్సిన వాటాలో విద్యుత్ దక్కి తీరాల్సిందేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఆంధ్రాపాలకుల కుతంత్రాల వల్ల ఇంతకాలం నష్టపోయిన తెలంగాణ, రాష్ట్రవిభజన తర్వాత కూడా అదే ఆంధ్రాపాలకుల వల్ల ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలపై బీజేపీ మంగళవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం చేయాల్సింది చేస్తూ, ఢిల్లీ పరిచయాలతో వాస్తవాలను మరుగునపడేసి మభ్యపెట్టగలుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రగతిబాట పట్టకపోతే ప్రత్యేకరాష్ట్ర సాధనకు అర్థమే ఉండదని, ఉద్యమ త్యాగాలకు విలువే ఉండదన్నారు. జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి సోలార్ యూనిట్లు ఏర్పడాలని, ఇంకా థర్మల్ విద్యుదుత్పత్తిపైనే ఆధారపడే ప్రయత్నం మానుకోవాలన్నారు.
 
 కేంద్రంతో రాష్ట్ర సర్కార్ సరిగా వ్యవహరించడం లేదు : కిషన్‌రెడ్డి
 రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో సరైన విధంగా వ్యవహరించడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు రావాల్సిందిగా తమ అభ్యర్థన మేరకు నాటి బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సిద్ధపడితే తాము ఆహ్వానించబోమంటూ రాష్ట్రంలోని అధికారపార్టీ నేతలు మొండిగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీని సన్నాసని, ఫాసిస్టని, కొత్త బిచ్చగాడని తూలనాడారని పేర్కొన్నారు. దీంతో సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. కరెంటు సమస్య పరిష్కారం కోసం తమవంతు ప్రయత్నం చేస్తామని మాటిచ్చారు. కేంద్రం నుంచి తక్షణం 500 మెగావాట్ల కరెంటును పొందడంతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్టు బీజేఎల్పీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు.
 
 రూ.150 కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల కరెంటు పొదుపు..
 వ్యవసాయ మోటార్ల వద్ద కెపాసిటర్లు ఏర్పాటు చేస్తే 300 మెగావాట్లకు పైగా కరెంటు పొదుపవుతుందని, ఇందుకు కేవలం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల సంఘాల సమన్వయకర్త రఘు తెలిపారు. కేరళ తరహాలో సీఎఫ్‌ఎల్ లైట్ల వినియోగంతో అంతకంటే ఎక్కువ ఆదా అవుతుందన్నారు. విద్యుదుత్పత్తికి తెలంగాణకు ప్రత్యేకంగా గ్యాస్ అందేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, హిందూజా, కృష్ణపట్నం ప్లాంట్ల నుంచి కరెంటు వాటా అందేలా చూడాలన్నారు.
 
 కేంద్ర సాయంతో పంపుసెట్లకు సౌరవిద్యుత్ ...
 తెలంగాణలోని 20 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లను సౌరవిద్యుత్తు పరిధిలోకి తేవాలని, ఇందుకు 60 వేల కోట్లు అవసరమవుతాయని, దీన్ని కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించేలా చూడాలని నీటిపారుదల రంగం నిపుణుడు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఇరవై ఏళ్లలో తెలంగాణలో 26 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, తెలంగాణ వచ్చాక 325 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ సంస్థ ప్రతినిధి రామాంజనేయులు చెప్పారు.
 
  కేంద్ర విద్యుత్ చట్టానికి కొన్ని సవరణలు చేయాలని ‘చేతన’ సంస్థ ప్రతినిధి నరసింహారెడ్డి పేర్కొన్నారు.  వ్యవసాయ అవసరాలకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా గ్యాస్ పొందితే నాలుగు నెలలకోసం వెయ్యి మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చని సీనియర్ విద్యుత్ ఇంజనీర్ మోహన్‌రెడ్డి తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ‘పవర్ ఫర్ ఆల్’ పథకంలో తెలంగాణకు చోటుదక్కేలా చూడాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శివాజీ కోరారు. తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఉమ్మడిరాష్ట్రపాలకులు అభివృద్ధి చేయలేదని  విద్యుత్‌రంగ నిపుణుడు సూర్యప్రకాశ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement