
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాల్లేక చాలా మంది రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లలోని ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని, వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయకపోవడం బాధాకరమని కోదండరాం పేర్కొన్నారు. సాగరహారానికి మద్దతుగా 2012 సెప్టెంబర్ 16న మహబూబ్‌నగర్‌లో జరిగిన తెలంగాణ కవాతు కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు రవిపై నమోదైన కేసులో శిక్ష పడటం దురదృష్టకరమన్నారు. రవికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాంపల్లిలో టీజేఎస్ కార్యాలయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయాన్ని నాంపల్లిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే అక్కడ ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే పార్టీ కార్యకలాపాలను ఆ భవనం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.