ఇందూరు గడ్డపై గర్జించిన గులాబీ బాస్

KCR Speech At Nizamabad Meeting - Sakshi

చంద్రబాబు తెలంగాణ ద్రోహి

బీడీ కార్మికులను గుర్రాలతో తొక్కించి ఘనత టీడీపీది

 ప్రతిపక్షాలపై దుమ్మెతిపోసిన కేసీఆర్‌ 

పెన్షన్‌ను పెంచుతాం.. రైతు సమన్వయ కమిటీలకు వేతనం

నిజామాబాద్‌ ప్రజా అశీర్వాద సభలో కేసీఆర్‌

సాక్షి, నిజామాబాద్‌ : కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబు చేతిలో పెట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆపధర్మ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ పోరాటయోధుల గుండెల్లో బులెట్లు దింపిన ద్రోహులు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ రద్దు అనంతరం సెప్టెంబర్‌ 7న ప్రజా ఆశీర్వాద సభ ద్వారా కేసీఆర్‌ ఎన్నికల శంఖారావంను పూరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత 25 రోజులపాటు విరామం తీసుకున్న కేసీఆర్‌ బుధవారం నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కాలేజీలో రెండో విడుత ప్రచార సభను ప్రారంభించారు. గతకొంతకాలంగా ప్రతిపక్షాలపై మౌనంగా ఉన్న ఆయన ఇందూరు సభలో చెలరేగిపోయారు. ముఖ్యంగా చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలను టార్గెట్‌గా చేసుకుని..తన పదునైన మాటల తూటాలను సంధించారు. కొట్లాడి, అమరుల ప్రాణాలు అర్పించి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి చెందకుండా టీడీపీతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ అనేక కుట్రలకు పాల్పడుతోందని.. ఆ పార్టీలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

‘ప్రాజెక్టులు కట్టకుండా ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. తెలంగాణ రైతన్నలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధం పథకం రెండో విడుత చెక్కులు పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని కేసుల వేస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. రైతుబంధు పథకం, పంటలకు 24గంటల ఉచిత కరెంట్‌, రైతులకు సబ్సిడీ రుణాలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇలా దేశంలో నెంబర్‌ వన్‌గా నిలబెడుతుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి’ అని కేసీఆర్‌ మండిపడ్డారు.

‘‘2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలిసారి ఎన్నికల్లోనే నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికల్లో ఇదే ఇందూరు గడ్డ మొత్తం 9 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించి ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే జవాబిచ్చింది. నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ కంచుకోట. గత నాలుగేళ్లలో అనేక సక్షేమ పథకాలను అమలు చేశాం. ఇదే పాలన కొనసాగాలి అంటే గత ఫలితాలే మరళా పునరావృత్తం కావాలి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు లేదు, నీళ్లులేవు, ఉద్యోగాలు లేవు, రైతుల ఆత్మహత్యలు ఇవే తెలంగాణలో ఎక్కడ చూసిన కనిపించేవి. ఎన్నో సవాళ్లను స్వీకరించి దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణను నిలిపాం. తెలంగాణకు అడ్డుపడ్డ వారే నేడు పొత్తులు పెట్టుకుంటున్నారు. నిజంగా కాంగ్రెస్ నేతలు సిగ్గు ఉంటే తెలంగాణ ద్రోహి అయన చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటారా.. చిల్లర రాజకీయాలకోసం దుర్మార్గుడైన ఆయనతో దోస్తీ కలుస్తారా. తెలంగాణ కార్మికులను గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబుది. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాకుండా, నీళ్లు రాకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నది చంద్రబాబు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ అమరావతి, ఢిల్లీలో తాకట్టుపెట్టడానికి, ఢిల్లీలో గులాంగిరి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని అన్నారు.

కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణను 1956లో అన్యాయంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ. నేడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర లేదని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. గతంలో వరంగల్‌ ఉప ఎన్నికల్లో జైపాల్‌ రెడ్డి ఇదే మాట అన్నారు. అప్పుడు సవాలు విసిరా..కేసీఆర్‌ ఉద్యమంలో లేకపోతే ఓటు కాంగ్రెస్‌కే వెయ్యండి అని. తెలంగాణ ఉద్యమాన్ని గమనించిన ప్రజలు 49000 మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దయాకర్‌ను గెలిపించారు. ఇప్పుడు గులాంనబీ ఆజాద్‌ కూడా అదే అంటున్నాడు. ప్రతిపక్షాల సవాలు మేరకే ముందస్తు ఎన్నికలు పిలుపునిచ్చా. ప్రజల్లోకిపోలేక ప్రతిపక్షాలు గోడలుగీక్కుంటున్నాయి. ఎన్నికలను ఎదుర్కొనే దమ్ములేకనే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ప్రతిపక్షాల అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టి ఇందూరు గడ్డపై మరోసారి గులాబీ జెండాను ఎగరేయ్యాలి’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top