నేటి నుంచే ‘కంటి వెలుగు’

 KCR Launch Kanti Velugu Scheme In Medak  - Sakshi

మెదక్‌ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభించనున్న కేసీఆర్‌

స్వాతంత్య్ర వేడుకల తర్వాత నేరుగా గ్రామానికి ముఖ్యమంత్రి

అక్కడ ఊళ్లో కాసేపు పర్యటన

అనంతరం కార్యక్రమం స్టాళ్లు ప్రారంభించనున్న సీఎం

6 నెలల పాటు కార్యక్రమం

సాక్షి, మెదక్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ ఆదర్శ గ్రామం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లో పంద్రాగస్టు వేడుకలు ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాఫ్టర్‌లో కేసీఆర్‌ మల్కాపూర్‌ గ్రామం చేరుకుంటారు. మొదట గ్రామంలోని రాక్‌ గార్డెన్‌లో మొక్క నాటుతారు. తర్వాత అక్కడి దుర్గామాత ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం గ్రామంలో కాసేపు పర్యటించి కంటి వెలుగు స్టాళ్ల వద్దకు చేరుకుని పథకం ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా కంటి వైద్యులు సీఎంకు పరీక్షలు నిర్వహించనున్నారు. పథకం ప్రారంభించిన తర్వాత గ్రామస్తులతో సీఎం మాట్లాడతారు. ఈ ముఖామఖి కార్యక్రమంలో మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 972 మంది పాల్గొనున్నారు. కార్యక్రమం తర్వాత కేసీఆర్‌ తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ వెళ్తారు. మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి తదతరులు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నేత్రదానానికి 800 మంది అంగీకారం
కేసీఆర్‌ పర్యటనలో భాగంగా మల్కాపూర్‌ గ్రామంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో పటిష్టమైన బందోబస్తు చేశారు. కార్యక్రమానికి ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. సీఎం కార్యక్రమంలో పాల్గొనే గ్రామస్తులకు పోలీసులు గుర్తింపు కార్డులిచ్చారు. 1,000 మంది మల్కాపూర్‌ గ్రామస్తులు నేత్రదానం చేసేలా వైద్యారోగ్య శాఖ, స్థానిక యువకులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. 3 రోజులుగా యువకులు గ్రామస్తులను నేత్రదానానికి ఒప్పిస్తున్నారు. ఇప్పటివరకు 800 మందినేత్రదానానికి ముందుకొచ్చారు. బుధవారం కేసీఆర్‌తో జరిగే కార్యక్రమంలో నేత్రదానం అంగీకార పత్రాలను గ్రామస్తులు అధికారులకు ఇస్తారు.

హెలిపాడ్‌ స్థలంలో చువ్వలు
మల్కాపూర్‌ గ్రామం సమీపంలో సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం హెలిపాడ్‌ సిద్ధం చేశారు. మంగళవారం బాంబ్‌ స్క్వాడ్‌ హెలిపాడ్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నపుడు మెటల్‌ డిటెక్టర్ల నుంచి అలర్ట్‌ సౌండ్‌ వెలువడింది. అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు ఆ స్థలంలో తవ్వి చూడగా ఇనుప చువ్వలు వెలువడ్డాయి. వాటిని తొలగించి హెలిపాడ్‌ను సిద్ధం చేశారు.

కంటి వెలుగుకు రూ.106 కోట్లు
కంటి వెలుగు కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. సమస్యలున్న వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేస్తారు. రాష్ట్రంలోని మూడున్నర కోట్ల జనాభాకు పరీక్షలు చేస్తామని వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. వారిలో దాదాపు 40 లక్షల మందికి అద్దాలు, 3 లక్షల మందికి శస్త్రచికిత్సలు అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు. ఇంత భారీ స్థాయిలో సామూహిక కంటి పరీక్షల కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ. 106 కోట్లు కేటాయించింది.

ఫ్రాన్స్‌ కంపెనీ నుంచి కళ్లద్దాలు
కళ్లద్దాలను ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎస్సల్లార్‌’కంపెనీ సరఫరా చేయనుంది. వారు 36 లక్షల కళ్లద్దాలు, రీడింగ్‌ గ్లాసులు సరఫరా చేస్తారు. ఇతరత్రా లోపాలతో బాధపడుతున్న వారికి ప్రిస్కిప్షన్‌ ఇస్తే మూడు నాలుగు వారాల్లో అద్దాలను సరఫరా చేస్తారు. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ. 100 కాగా, ఆ ప్రకారం ఎస్సల్లార్‌కు కాంట్రాక్టు ఇచ్చారు. కంటి శస్త్రచికిత్సల కోసం 114 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు.. స్వచ్ఛంద సంస్థలను గుర్తించారు. కస్టమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ద్వారా కార్యక్రమాన్ని అమలు చేస్తారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి యూనిట్‌గా పరీక్షలు జరుగుతాయి. మొత్తం 799 బృందాల్లో 940 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 1,000 మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. 33 వేల మంది సిబ్బందిని కార్యక్రమం కోసం కేటాయించారు. 6 నెలల పాటు కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికప్పుడు సమాచారం కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం కంటి సమస్యతో బాధపడే వారి కోసం భవిష్యత్‌లో 150 విజన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top