నేడు ఖమ్మంకు కేసీఆర్‌

KCR Election Visit In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) సోమవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. శాసనసభ రద్దయిన వెంటనే సెప్టెంబర్‌ 6వ తేదీన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ జిల్లాలో అదే సమయంలో పర్యటిస్తారని ప్రచారం జరిగినా..ఒకటిరెండుసార్లు ఆయన పర్యటన షెడ్యూలు దాదాపు ఖరారైనా చివరి నిమిషంలో రద్దయింది. ఇప్పుడు నామినేషన్ల గడువు ముగింపు దశకు చేరుకోవడం, ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు వేడెక్కిస్తుండడంతో కీలకమైన ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ పరంగా మరింత వేగవంతం చేసేందుకు, సభను విజయవంతం చేసేందుకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా నేరుగా పటేల్‌ స్టేడియంకు చేరుకుంటారు.

పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటనను విజయవంతం చేసేందుకు, పార్టీ శ్రేణులను సమీకరించేందుకు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌లు ఆయా నియోజకవర్గాల కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి జనసమీకరణపై దృష్టి సారించారు. మరోవైపు కేసీఆర్‌ పాల్గొనే సభాస్థలిని టీఆర్‌ఎస్‌ జెండాలతో, గులాబీ తోరణాలతో అలంకరించారు.

మిట్ట మధ్యాహ్నం సభ నిర్వహిస్తుండడంతో పార్టీ కార్యకర్తలకు మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలను గుర్తించారు. ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా పోలీస్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నేతృత్వంలో భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహించనున్నారు. 

ఉండేది గంట సమయమే.. 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేవలం 45నిమిషాల నుంచి గంటలోపే ఖమ్మంలో గడిపే అవకాశం ఉండడంతో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను సభా వేదిక పై ప్రజలకు పరిచయం చేసి ఒకరిద్దరి ప్రసంగాల తర్వాత సభలో ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత కేసీఆర్‌ పార్టీ ఎన్నికల ప్రచారం, వివిధ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల ప్రభవాం, అభ్యర్థులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అసమ్మతి చల్లారినట్లు కనబడుతున్నా మరికొన్నిచోట్ల తమకు పూర్తి సహకారం లభించట్లేదని పార్టీ అభ్యర్థులు పలువురు ఇప్పటికే కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయా అంశాలపై దృష్టి సారించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ బహిరంగ సభకు చేరుకోవడానికి ముందే పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో, ఖమ్మం అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంఅర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే భారీ ర్యాలీతో కార్యకర్తలతో కలిసి సభాస్థలికి చేరుకొని కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top