చంద్రబాబు అడుగుపెడితే ఊరుకోం: కేసీఆర్‌

KCR Address Public Meeting In Khammam - Sakshi

సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు రాసిన చంద్రబాబు

లేఖలు వెనక్కితీసుకున్న తరువాతే ఈ గడ్డపై అడుగుపెట్టాలి

నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే నామాలు పెడతారు

ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

సాక్షి, ఖమ్మం :  ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపధర్మ సీఎం కేసీఆర్‌.. ఏపీ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఖమ్మం​ జిల్లాకు తలమానికంగా మారిన సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు.. వాటిని వెనక్కి తీసుకున్న తరువాతనే ఈ గడ్డపై అడుగుపెట్టాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే ఇక్కడికి రావాలని, లేకపోతే ఊరుకోమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. యాభైఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఖమ్మంలో పోడు భూములు తప్ప రైతులకు ఏమీ మిగిల్చలేక పోయారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు ఓట్లు ఎందుకేయ్యాలని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి అయిన టీడీపీని చైతన్యవంతులైన ఖమ్మం​ ప్రజలు తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు టీడీపీ, కాంగ్రెస్‌లపై కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ ఇతరపార్టీలు ఎన్ని జిమ్మికులు చేసిన టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జల్లాలోని ఏడు ముంపు మండలాలను నిండా ముంచుతూ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని వివరించారు. తెలంగాణకు ఎంతో కీలకమైన సీలేరు పవర్‌ ప్లాంట్‌ను చంద్రబాబు  అక్రమంగా గుంజుకున్నారని పేర్కొన్నారు. కూటమీ తరుఫున ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావును గెలిస్తే ఖమ్మం ప్రజలకు నామాలు పెడతారని ఎద్దేవా చేశారు. ఖమ్మం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడని.. ఆయన తనకు కొడుకుతో సమానులని వ్యాఖ్యానించారు.

సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా గతంలో ఖమ్మంలో అనేకసార్లు పర్యటించా. ఉద్యమాల ఖిల్లా, చైతన్యవంతుల గడ్డగ ఈ జిల్లాకు పేరుంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఈసారి పదికి పది స్థానాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాం. దేశంలోనే కాదు ప్రపంచలో ఎక్కడా అమలుకాని విధంగా ఏకంగా 411 పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో రైతుల ఆత్మహత్యలు తప్ప ఏమీలేవు. రాష్ట్రం ఏర్పడిన మూడేళ్లలోనే రైతులకు 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్నాం. 43 వేల కోట్ల రూపాయాలతో వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. తెలంగాణకు కాళేశ్వరం ఏలా ముఖ్యమైన ప్రాజెక్టో.. వెనుకబడిన ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు అంత కీలకమైనది. ఈ జిల్లాలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సండ్ర వెంకట వీరయ్య, నామా నాగేశ్వరరావుల, మచ్చా నాగేశ్వరరావులు గెలిస్తే చంద్రబాబు వద్ద మోకరిల్లి మన ప్రాజెక్టులకు అడ్డుపడతారు. కాబట్టి ఈ కుట్రలను ఖమ్మం ప్రజలు తిప్పికొట్టాలి. వారిని ఓడిస్తేనే మన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి’’ అని పేర్కొన్నారు.

కేసీఆర్‌ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘మహాకూటమిలో కులం ముసుగులో వచ్చేవారి చెంపచెల్లుమనిపించే విధంగా తీర్పునివ్వాలి. పాలేరు నియోజవర్గంలో వెనుకబడిన మండలాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తుమ్మల నాగేశ్వరరావుకే చెందుతుంది. భక్త రామదాసు ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేశారు. అది ఆయన డైనమిజం. ఖమ్మం జిల్లాలో గోదావరి నది 150 కి.మీకి పైగా ప్రవహిస్తుంది. అయినా కూడా ఇక్కడ ఇంకా బీడు భూములు ఉన్నాయి. సంక్షేమ పథకాలు మరింత ముందుకు సాగాలంగే తిరిగి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పడాలి. మన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాగానే గతంలో 1000 ఇచ్చిన ఆసరా పింఛన్లను 2016కు పెంచుతాం. దివ్యాంగులకు 3016 ఇస్తాం. ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం. ఆ పథకం సహాయాన్ని ఎకరానికి పదివేలకు పెంచుతాం. మరిన్ని పథకాలను కూడా తెలంగాణ ప్రజలకు అందిస్తాం’’ అని అన్నారు.

తమ పాలనలో నో ‘స్కామ్‌’
పాలకుర్తి: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో భాగంగా ప్రచార జోరు పెంచిన గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్ని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పాలనలో చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమలు, పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్కామ్‌లకు పాల్పడకుండా నిజాయితీగా పాలన అందించినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా రైతు బంధు అమలు చేస్తున్నామని తెలిపారు. అంగన్‌ వాడీ ఉద్యోగులకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎక్కువ జీతాలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే కరెంట్‌ ఉంటుందన్న గ్యారెంటీ లేదని ఎద్దేవ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top