జహీరాబాద్ కోర్టులో నాన్‌బెయిలబుల్ వారెంట్‌కు రీకాల్ లభించిన సంతోషం నుంచి తెరుకోకముందే సిద్దిపేట న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ కింద జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ చేశారు.
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: సిద్దిపేట న్యాయస్థానంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి చుక్కెదురైంది. జహీరాబాద్ కోర్టులో నాన్‌బెయిలబుల్ వారెంట్‌కు రీకాల్ లభించిన సంతోషం నుంచి తెరుకోకముందే సిద్దిపేట న్యాయమూర్తి కోర్టు ధిక్కరణ కింద జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ ్యలు చేసిన జగ్గారెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టు ధిక్కరణ కింద 14 రోజుల పాటు కస్టడీ విధిస్తూ సిద్దిపేట జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ శుక్రవారం ఆదేశాలిచ్చారు. వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగ్గారెడ్డి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. దీంతో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య జగ్గారెడ్డిని సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు.
ఒకసారి పూర్వపరాలను పరిశీలిస్తే.. సిద్దిపేట ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక దూది మల్లారెడ్డి ఫంక్షన్ హాల్‌లో 2010 జూన్ 28న నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరుసటి రోజే మిట్టపల్లికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త సిద్ధరబోయిన శ్రీనివాస్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో 2010 నవంబర్ 8న న్యాయస్థానం జగ్గారెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెం ట్‌ను జారీ చేసింది. నాటి నుంచి నేటివరకు కోర్టుకు హాజరుకాని ఎమ్మెల్యే శుక్రవారం సిద్దిపేట న్యాయస్థానంలో హాజరై తనపై ఉన్న వారెంట్‌ను రీకాల్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మూడున్నర సంవత్సరాల సుదీర్ఘ కాలానికి సంబంధించిన వారెంటును రీకాల్ చేయడం కుదరదని పిటిషన్‌ను తిరస్కరించారు.
జిల్లా జైలు వద్ద భారీగా పోలీసుల మోహరింపు
సంగారెడ్డి క్రైం : సిద్దిపేట కోర్టు ఆదేశాలతో పోలీసులు శుక్రవారం రాత్రి 9.10 గంటలకు ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డిని కందిలోని జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలు సమీపంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. జగ్గారెడ్డి అనుచరులు, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు. దీంతో కంది ప్రధాన రహదారిపై కొద్దిసేపు పోలీసులు, కార్యకర్తలకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాత్రి 9.10 గంటలకు జగ్గారెడ్డిని జైలులోకి తీసుకెళ్లారు. ఆయన వెంట కార్యకర్తలు జైలులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జయప్రకాష్‌రెడ్డిని జైలు ప్రధాన గేట్ వరకు అనుమతించారు. జైలులో ఆయనకు 6043 నంబరును కేటాయించారు.