కుమ్ములాటలు | inner conflicts in trs party | Sakshi
Sakshi News home page

కుమ్ములాటలు

Sep 5 2014 11:34 PM | Updated on Sep 2 2017 12:55 PM

కుమ్ములాటలు

కుమ్ములాటలు

అధికార టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షురువయ్యాయి.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికార టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షురువయ్యాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఆదిపత్య పోరు రోజుకింత ముదిరి పాకాన పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ దామోదర్‌రెడ్డి పై అవిశ్వాస తీర్మానం ఆ పార్టీ జిల్లా అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరును రచ్చ కీడ్చగా, తాజాగా ఇప్పుడు జిల్లా పరిషత్ కూడా ఈ అంతర్గత కుమ్ములాటలకు వేదికవుతోంది. వారం రోజుల క్రితం జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల నియామకాలు జరిగాయి.
 
మొత్తం ఏడు స్టాండింగ్ కమిటీల సభ్యులను నియమించారు. ఈ కమిటీలకు గత నెల 27న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసినప్పటికీ.. తెరవెనుక భారీ తతంగం చోటు చేసుకుంది. ఈ కమిటీల విషయంలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా ‘పనులు’, ‘ప్రణాళిక’ కమిటీల్లో సభ్యులుగా చేరేందుకు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పోటీ పడ్డారు. జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసే రూ.కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల కేటాయింపులు, ఆ పనుల ప్రగతిని సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది.
 
మిగిలిన ఐదు కమిటీల విషయంలో పెద్దగా అభ్యంతరాలేవీ లేకపోయినప్పటికీ ప్రధానమైన ఈ రెండు కమిటీల విషయంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలను ఏకాభిప్రాయానికి తేవడానికి జెడ్పీ చైర్మన్ శోభా సత్యనారాయణగౌడ్‌కు తల ప్రాణం  తోకకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత కలిగిన ఈ రెండు కమిటీల్లో మంత్రి రామన్న, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, నల్లాల ఓదేలు, రేఖానాయక్, విఠల్‌రెడ్డిలతోపాటు పలువురు జెడ్పీటీసీలకు చోటు దక్కింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే బీఆర్‌జీఎఫ్ నిధుల విషయంలోనూ జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య దూరం పెరుగుతోంది.
 
2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.26.98 కోట్ల బీఆర్‌జీఎఫ్ వార్షిక ప్రణాళికకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసిన విషయం విధితమే. జిల్లా, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు.. నాలుగు కాంపోనెంట్ల కింద ఈ నిధులు మంజూరవుతాయి. జెడ్పీ కాంపోనెంట్ కింద రూ.5.39 కోట్లు నిధుల విషయంలో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండకూడదని కొందరు జెడ్పీటీసీలు భావిస్తున్నారు. గ్రూపు తగాదాలకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు కూడా పాకుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement