
నేరుగా రాకుంటే.. మీ ఓటు లేనట్లే
‘మీరు ఫలానా తేదీన.. ఫలానా సమయానికి.. స్వయంగా మా ఎదుట హాజరుకండి. లేకుంటే మీరు లేనట్లుగా భావిస్తాం. ఈ విషయంలో మళ్లీ మీరు చెప్పుకునేదేమీ ఉండదు. మీ ఓటును తొలగిస్తాం..’ అని ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీ ఓటర్లకు కొత్త రకం తాఖీదులు జారీ చేస్తోంది.
ఎన్నికల అధికారుల నోటీసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాఖీదులు
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఫలానా తేదీన.. ఫలానా సమయానికి.. స్వయంగా మా ఎదుట హాజరుకండి. లేకుంటే మీరు లేనట్లుగా భావిస్తాం. ఈ విషయంలో మళ్లీ మీరు చెప్పుకునేదేమీ ఉండదు. మీ ఓటును తొలగిస్తాం..’ అని ఎన్నికల సంఘం జీహెచ్‌ఎంసీ ఓటర్లకు కొత్త రకం తాఖీదులు జారీ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమీపంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిని స్వయంగా కలవాలనే నిబంధనతో హడలెత్తిస్తోంది. నిజంగానే చిరునామాలో లేని ఓటర్లకు ఈ నోటీసులు జారీ చేసిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. కూకట్‌పల్లిలోని అపార్టుమెంట్‌లో నివసిస్తున్న కుటుం బాలన్నింటికీ దాదాపుగా ఈ నోటీసులు జారీ అయ్యాయి.
వీరందరూ అక్కడే నివాసముంటున్నప్పటికీ.. ‘మీ ఎపిక్ కార్డులో ఉన్న చిరునామాలో 6 నెలలకుపైగా మీరు అందుబాటులో లేరు. అందుకే మిమ్మల్ని అక్కడ తాత్కాలిక నివాసులుగా పరిగణించాల్సి వస్తోంది. ఓటర్ల జాబితా నుంచి మీ పేరును తొలిగించేందుకు ఈ నోటీసు జారీ చేస్తున్నాం..’ అంటూ కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓటర్లకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. కూకట్‌పల్లి ప్రాంతంలోని 16-31-503/303 ఇంటి నంబర్‌లో ఉన్న సుబ్రహ్మణ్యం, శారద, శర్మలతో పాటు పలువురికి ఈ నోటీసులు అందాయి. ‘మేమున్నా లేనట్లుగా ఎందుకు నోటీసులు వచ్చాయి.. నేరుగా అధికారుల ఎదుట హాజరు కావాలని హెచ్చరిస్తారా..? అని ఈ నోటీసులు అందుకున్న ఓటర్లు బిత్తరపోతున్నారు.
ఓట్లను తొలిగించేందుకు ఎన్నికల అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వచ్చి, విచారించకుండానే ఓట్లు తొలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఓట్ల ఏరివేతకు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోం ది. నిబంధనల ప్రకారం ఇంటింటి సర్వే సందర్భంగా ఓటర్లు అక్కడి చిరునామాలో లేరని గుర్తిస్తే ఎన్నికల అధికారులు ఓటర్లకు నోటీసులు జారీచేస్తారు. తగిన ఆధారాలు చూపిం చాలని.. లేకుంటే ఓటు హక్కు తొలగించాల్సి ఉంటుందని అందులో పేర్కొనటం సాధారణమే. కానీ.. నేరుగా తమ ఎదుట హాజరు కావాలని తాఖీదులు పంపడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దృష్టికి తీసుకెళ్లగా.. డోర్ టు డోర్ సర్వేల తర్వాతనే నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఓటర్లు సమీప ఈఆర్‌వో కార్యాలయంలో నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేదని.. తమ దగ్గరున్న గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డుల నంబర్లు చెప్పి ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చని వివరించారు.