కాళోజీ బతికి ఉంటే ఆర్టీసీ సమ్మెలో కూర్చునేవారు

If Kaloji Was Alive He Would Be In RTC Strike - Sakshi

విలువలకు దర్పణం కాళోజీ సోదరులు

కేయూ విశ్రాంతాచార్యులు డాక్టర్‌ కాత్యాయనీ విద్మహే

సాహితీవేత్త వేణు సంకోజుకు కాళోజీ స్మారక పురస్కారం ప్రదానం

సాక్షి, హన్మకొండ: కాళోజీ సోదరులు ప్రజాస్వామిక విలువలకు దర్పణం వంటివారని కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతాచార్యులు డాక్టర్‌ కాత్యాయనీవిద్మహే అన్నారు. ప్రజాస్వామ్య భావన ఇద్దరిలోనూ సామాన్య లక్షణమని, ఈరోజు కాళోజీ బతికి ఉంటే ఆర్టీసీ కార్మికుల కోసం సమ్మెలో కూర్చోవడమే కాకుండా మనల్ని కూడా పాల్గొనమని చెప్పేవారని పేర్కొన్నారు. కాళోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యాన వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో బుధవారం రాత్రి కాళోజీ యాదిసభ, కాళోజీ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమంలో కాత్యాయనీ విద్మహే మాట్లాడారు. ఆధీకృత హింస రాజ్యమేలుతుంటే ప్రతిహింస తప్పెలా అవుతుందని కాళోజీ ప్రశ్నించారని, వర్తమాన పరిస్థితులలో ప్రతిరోజూ ఆయన గుర్తుకు వస్తుంటారని తెలిపారు.

ప్రజాస్వామ్యం అంటేనే భిన్నాభిప్రాయాలను గౌరవించడమని, కవులు ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెప్పారని గుర్తు చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేవారని, తాను నక్సలైట్‌ కానప్పటికీ ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నిలదీశారని చెప్పారు. కుటుంబ విలువలు, సోదర ప్రేమకు చిహ్నంగా నిలిచిన కాళోజీ సోదరులు ఒకే కొమ్మకు రెండు రెమ్మల వంటి వారన్నారు. వేణు సంకోజు ఇప్పటికీ నిజాయితీ, హృదయం గల కవిగా నిరూపించుకున్నారని.. అందుకే కాళోజీ అవార్డును ఇచ్చి గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రముఖ కవి, సుప్రసిద్ధ సాహితీవేత్త వేణు సంకోజు, విజయలక్ష్మి దంపతులను శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. కాళోజీ ఫౌండేషన్‌ ఉపాధ్యక్షులు ఎస్‌.జీవన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి రామాచంద్రమౌళి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్‌ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు, కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్‌లు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top