
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఊరించిన కలల ప్రాజెక్టు మెట్రో రైలు పరుగు ప్రారంభమైంది. నిజానికి ప్రధాని చేతుల మీదుగా మంగళవారమే ప్రారంభమైనా.. భద్రతా కారణాల వల్ల నగర ప్రజలను నేడు( బుధవారం) అనుమతించారు. దీంతో నగర ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తెల్లవారు జాము నుంచే ఫ్యామిలీతో కలిసి సరదా ప్రయాణం మెదలెట్టారు.
ఇన్నాళ్లు ట్రాఫిక్ సమస్యతో నరకం అనుభవించిన నగర ప్రజలకు మెట్రోతో కొంత మేర ఊరట లభించింది. అయితే మెట్రో ధరలు మాత్రం సామన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెట్రో ఎక్కిన ప్రతి ప్రయాణీకుడు ఆనందం వ్యక్తం చేస్తూనే ధరలు కొంత అందుబాటులో ఉంటే బాగుండు అని పెదవి విరుస్తున్నారు.
అప్పుడప్పుడు ప్రయాణించే వారికి ఫర్వాలేదనిపించినా, ఉద్యోగాల కోసం వెళ్లే వారికి ఈ ధరలు మింగుడు పడటం లేదు. ఇక మెట్రో స్టేషన్ ధరల పట్టికను చూస్తే.. నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే రూ.60 చెల్లించాల్సిందే. అదే నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు రూ.45గా ఉంది. ఇవి బస్సు టికెట్ ధరల కన్నా ఎక్కువగా ఉండటంతో సామన్యులు భారంగా భావిస్తున్నారు.