ఫలక్‌నుమా నాగులబండ అంబేద్కర్ నగర్‌లో శనివారం ఉదయం హై వోల్టేజీ కారణంగా దాదాపు 200 ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి.
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఫలక్‌నుమా నాగులబండ అంబేద్కర్ నగర్‌లో శనివారం ఉదయం హై వోల్టేజీ కారణంగా దాదాపు 200 ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. ఉదయం 9.25 గంటల సమయంలో ఇళ్లల్లో పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగెత్తారు. ఆ సమయంలో వైర్లు కాలుతూ టీవీలు, ఫ్రిజ్‌ల నుంచి పొగలు రావడం గమనించారు. ఈ సమయంలో మిక్సీ ఉపయోగిస్తున్న 7వ తరగతి విద్యార్థిని అఖిల(12) విద్యుదాఘాతానికి గురైంది. ఆమెను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఇన్‌చార్జ్ ఏడీఈ అన్నయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. బస్తీలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించిన అధికారులు దానిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపి దాని స్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి సాయంత్రానికి విద్యుత్‌ను పునరుద్ధరించారు.