‘ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌’లకు హైకోర్టు ఓకే 

High Court Green Signal To FBO Postings - Sakshi

1,857 పోస్టుల్ని భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశం   +

సాక్షి, హైదరాబాద్‌: ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల నియామకానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బీట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీని చేపట్టాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను హైకోర్టు ఆదేశించింది. 1,857 బీట్‌ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2017 ఆగస్టు 18న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, టీఎస్‌పీఎస్సీ 6(ఎ) రూల్స్‌ పాటించకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం చెల్లదని పేర్కొంటూ ఆనందరావు మరో అయిదుగురు హైకోర్టును ఆశ్రయించారు. రూల్‌ 6(ఎ) ప్రకారం నియామకాలు చేయాలని గతంలో సింగిల్‌ జడ్జి టీఎస్‌పీఎస్సీని ఆదేశించగా, దానిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు అనుమతించింది. 

ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఎవరైనా ఆయా పోస్టుల్లో చేరకుండా ఆరు పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని తర్వాత ఏడాదిలో ఖాళీల్లో చూపించకుండా పిటిషనర్లు ఆరుగురిలో అర్హత ఉంటే వారితో భర్తీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ విధంగా చేసేప్పుడు ముందుగా చేరిన వారితో సమానంగా పరిగణించాలని, వారికి సీనియార్టీ, ఆర్థికపరమైన విషయాల్లో నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాది రాహుల్‌రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఆరుగురు పిటిషనర్ల మాదిరిగా మరికొందరు హైకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు ఏం చేయాలనే సందేహాన్ని లేవనెత్తారు. దీనిపై హైకోర్టు.. ‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తొలుత కోర్టుకు వచ్చిన వారికే అది వర్తిస్తుంది’అని స్పష్టం చేసింది. అర్హత ఉండి పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు పిటిషనర్లకు అవకాశం కల్పించడం న్యాయబద్ధమేనని పేర్కొంది. పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియను పూర్తి చేసిందని, సింగిల్‌ జడ్జి ఆదేశాల కారణంగా పోస్టుల భర్తీ ఆగిపోయిందని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. ఎంపికైన వారంతా పోస్టుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో తన వద్ద సమాచారం లేదని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యాక ఖాళీగా పోస్టులు ఉంటే వాటిని తర్వాత ఏడాదికి బదిలీ చేస్తామని, ఇలా చేయని పక్షంలో ప్రతిభ, రిజర్వేషన్లు వంటి సమస్యలు తలెత్తుతాయని ఏజీ చెప్పారు. వాదనల అనంతరం హైకోర్టు.. ప్రభుత్వ అప్పీల్‌ను అనుమతించి పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 

ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అడవులకు రక్షణ ఏది?  
‘అటవీ శాఖలో ఖాళీలని భర్తీ చేయకపోవడం వల్ల అడవుల్లో జంతువుల సంఖ్య తగ్గిపోతోంది. వేటాడేవాళ్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. కలపను అక్రమంగా తరలించేస్తున్నారు. ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు చిన్నపాటి ఆటంకాల్ని తొలగించాలి. అడవులు ఉంటే పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వీలవుతుంది’అని విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top