ఉత్తమ కలెక్టర్‌గా ఎం.హనుమంతరావు 

Hanumantha Rao as the best collector - Sakshi

నేడు అవార్డు స్వీకరించనున్న సంగారెడ్డి కలెక్టర్‌ 

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హనుమంతరావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. దివ్యాంగులకు అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ప్రభుత్వం ఆయనను ‘ఉత్తమ కలెక్టర్‌’అవార్డుకు ఎంపిక చేసింది. మంగళవారం ఆయన ఈ అవార్డును హైదరాబాద్‌లో అందుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సోమవారం ఆయన స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక చొరవ చూపించారు. వీల్‌చైర్స్‌ సమకూర్చడం, కళ్లులేని వారిని, నడవలేని వారిని ఇంటి నుంచే సిబ్బందితో పోలింగ్‌ కేంద్రానికి తీసుకురావడం, ఓటు వేసిన తరువాత మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టడం, పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన వారికి సిబ్బంది సహాయంగా ఉండడం లాంటి చర్యలను ఆయన చేపట్టారు.

దివ్యాంగుల ఆర్థిక ప్రగతికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేశారు. అలాగే బ్యాటరీతో నడిచే వాహనాలు, వీల్‌చైర్ల పంపిణీ, ప్రజావాణిలో వారి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, డివిజన్‌ స్థాయిల్లో కూడా వారికి ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఈ సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఆయనను ఉత్తమ కలెక్టర్‌గా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top