ఫీలింగ్‌.. ఫిర్యాదు | HakI App For Feeling Sharing on hyderabad Police | Sakshi
Sakshi News home page

ఫీలింగ్‌.. ఫిర్యాదు

Nov 1 2018 10:37 AM | Updated on Nov 10 2018 1:16 PM

HakI App For Feeling Sharing on hyderabad Police - Sakshi

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు, అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం అందించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘హాక్‌–ఐ’ యాప్‌ సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. ఆ యాప్‌లో ‘పోలీసుల తీరు’పై ప్రజాభిప్రాయానికి చోటుకల్పిస్తున్నారు. ఎక్కడన్నా పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రవర్తన సరిగా లేకున్నా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఇలా సంప్రదింపులు జరిపిన వారి వివరాలు సైతం పూర్తి గోప్యంగా ఉండేలా రాష్ట్ర పోలీసు విభాగం చర్యలు తీసుకుంటోంది. ఈ ‘ఫీడ్‌బ్యాడ్‌’ సదుపాయం మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.   

సాక్షి, హైదరాబాద్‌: ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా రాష్ట్ర పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఫిర్యాదుదారులే కాకుండా ప్రతి ఒక్కరూ పోలీసులపై తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ‘హాక్‌– ఐ’ యాప్‌ ద్వారా ఇవ్వనుంది. దీని ద్వారా సంప్రదింపులు జరిపిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫీడ్‌బ్యాడ్‌ ఇచ్చే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.

ఇప్పటి వరకు ఫిర్యాదుదారుల నుంచే..
అవినీతి నిరోధక, స్నేహపూర్వక పోలీసింగ్‌ విధానాలు చేపట్టిన హైదరాబాద్‌ పోలీసు విభాగం దాదాపు మూడేళ్ల క్రితమే ఫీడ్‌బ్యాక్‌ తీసుకునే ఏర్పాట్లు చేసింది. ఇది కేవలం ఫిర్యాదుదారులకే పరిమితమైంది. తమ సమస్యలు, సహాయం కోసం పోలీసుస్టేషన్‌కు వచ్చే వారు తామిచ్చే ఫిర్యాదులో వ్యక్తిగత వివరాలతో పాటు సెల్‌ఫోన్‌ నెంబర్‌ సైతం పొందుపరుస్తారు. ఈ వివరాలు పోలీసుస్టేషన్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా కమిషనరేట్‌లోని థర్డ్‌పార్టీ కాల్‌ సెంటర్‌కు చేరతాయి. ఇక్కడి సిబ్బంది ఈ డేటాబేస్‌ నుంచి కొన్ని ఫోన్‌ నెంబర్లను ఎంపిక చేసుకుని వారికి ఫోన్‌ చేస్తుంటారు. ఆశ్రయించిన పోలీసుల స్పందన, తీరుతెన్నులు తదితరాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. దీని ఆధారం ఆయా పోలీసుస్టేషన్లకు గ్రేడింగ్స్, అధికారుల పనితీరుకు మార్కులు సైతం ఇచ్చే ఏర్పాటు చేశారు. నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ వస్తే వారిపై విచారణ జరిపి చర్యలూ తీసుకుంటున్నారు.  

కనీసం రెండు శాతానికీచేరట్లేదని..
ఈ విధానం సిటీలో మంచి ఫలితాలను ఇచ్చింది. అధికారులు, సిబ్బంది తీరుతెన్నుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఎం.మహేందర్‌రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధానాన్ని  దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ రకంగా ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్న వారి శాతం జనాభాలో రెండు శాతం కూడా ఉండట్లేదని అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ నగరాన్నే తీసుకుంటే ఇక్కడ జనాభా కోటిగా భావిస్తే.. మూడు కమిషనరేట్లలోనూ కలిపి గరిష్టంగా లక్ష దాటట్లేదు. దీంతో అనేక మంది పోలీసులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చాలనే కృతనిశ్చయంతో పోలీసు అధికారిక యాప్‌ హాక్‌– ఐ యాప్‌ను వినియోగించుకోవాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే చేపట్టారు.

‘బ్యాడ్‌’ అయితేనేసంప్రదించేలా..
ఈ యాప్‌లో సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ కోసం ఓ లింకు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు ఎవరైనా ఈ లింక్‌ ఓపెన్‌ చేయడం ద్వారా పోలీసుల ద్వారా తమకు ఎదురైన అనుభవం, తాము గమనించిన నెగెటివ్‌ అంశం తదితరాలను పొందుపరచవచ్చు. లింక్‌లో ఎక్స్‌లెంట్, గుడ్‌ తదితరాలతో పాటు బ్యాడ్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. మిగిలిన ఆప్షన్‌ ఎంచుకుంటే కేవలం అది రికార్డు అవుతుంది. బ్యాడ్‌ను ఎంచుకుంటే మాత్రం ఓ ప్రత్యేక బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ఆ అభిప్రాయానికి కారణాన్ని సంక్షిప్తంగా రాసే అవకాశమూ ఉంటుంది. ఇలా చేసిన వారిని థర్డ్‌పార్టీ కాల్‌ సెంటర్‌ వారు సంప్రదిస్తారు. ఆ నెగెటివ్‌ అభిప్రాయానికి కారణం తెలుసుకుని, విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని తిరిగి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చిన వారికీ వివరిస్తారు. ఈ విధానంలో ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెల్లడి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement