ఆకట్టుకుంటున్న సర్కారు బడులు  | Government Schools | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న సర్కారు బడులు 

Aug 24 2018 2:11 PM | Updated on Aug 24 2018 2:11 PM

Government Schools  - Sakshi

కోటను తలపిస్తున్న వెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాల 

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెచ్చులూడి ఎప్పుడు కూలుతాయో తెలియని తరగతి గదులు.. రంగు తగ్గిన భవనాలు.. ఆ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి ముందుకురాని తల్లిదండ్రులు. వెరసి ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు దగ్గరవుతున్న క్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తుల భాగస్వామ్యంతో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారు. మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశంతో సర్కారు బడులు కళారూపాలుగా మారుతున్నాయి. నిన్న రైలు బండిలాగా వీర్నపల్లి పాఠశాల, నేడు గోల్కొండ కోటలోని గడిగా వెంకటాపూర్‌ బడిని కళాత్మకంగా తీర్చిదిద్దారు. 

సర్కారు బడిలో నూతన ఒరవడి.. 

గతంలో నిధులు, ఉపాధ్యాయులు లేక కార్పొరేట్‌ పాఠశాలల పోటీని తట్టుకోలేక విలవిలలాడిన సర్కారు బడులు ప్రభుత్వ దిశానిర్దేశంతో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాయి. పట్టణాల్లోని కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా ప్రభత్వ పాఠశాలలను ఆహ్లాదంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ఓ వైపు హరితహారంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచితే.. మరోవైపు రంగురంగుల బొమ్మలు కొత్త సోబగులు అద్దుతున్నాయి.

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో తరగతి గది గోడలను రంగురంగుల బొమ్మలతో చిత్రించారు. చిన్నపిల్లలను ఆకర్షించేలా, సమాజానికి మెసేజ్‌ను ఇచ్చేలా కళాకారుడు చందు తన కళాత్మక (చుక్, చుక్‌ బడి) కుంచెతో గోడలపై వేసిన చిత్రాలు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులను  ఆకర్షిస్తున్నాయి. వీర్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను రైలు బండిలా తయారు చేసిన చందు వెంకటాపూర్‌లో గడికోటను తలపించే విధంగా సర్కారు బడిని తీర్చిదిద్దారు. 

కళాకారుడి ప్రతిభ 

నర్మాలకు చెందిన కళాకారుడు చందు గంభీరావుపేట ఎంపీడీవో సురేందర్‌రెడ్డి సూచన మేరకు ప్రాథమిక పాఠశాలలకు ఆకర్షించే రంగులు వేస్తున్నాడు. బడులను బతికించడంలో తనవంతు బాధ్యతను గుర్తించిన చందు వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలకు వేసిన రైలుబండి చిత్రంకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో మరిన్ని పాఠశాలల్లో పిల్లలను ఆకర్షించేలా విభిన్న ఆలోచనలతో రంగులు వేయాలని తలిచి వెంకటాపూర్‌ పాఠశాలకు గోల్కొండ కోటను తలపించేలా రంగులద్దాడు.

వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలను రైలుగా మార్చిన చందు తన కుంచెతో మరో అద్భుతా నికి నాంది పలికారు. పక్కఫొ టో వెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాలది. విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నది  పాత గడిలోకి కాదు. రంగులతో మంత్రముగ్దుల్ని చేసిన కొత్త సర్కారు బడిలోకి. పాఠశాలను చూసి విద్యార్థులు తమ కళ్లముందుకే గోల్కొండ కోట వచ్చిందని సంబుర పడుతున్నారు.

విద్యార్థుల సంఖ్య పెరిగింది 

చందు రంగులతో బడిలి కోటలాగా మార్చాడు. చాలా మంది చూడటానికి వస్తున్నారు. గుహలాగా ఉన్న రంగురంగు గోడలు పిల్లలను బాగా> ఆకర్షిస్తున్నాయి. దీంతో పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. అధికారులు చొరవ తీసుకొని బడిని తీర్చిదిద్దుతున్నారు. 

– పి. దేవయ్య,ప్రధానోపాధ్యాయుడు, వెంకటాపూర్‌

సహకారంతోనే సాధిస్తున్నా.. 

నాకు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తున్నారు. ఎంపీడీవో  కొత్తగా ఆటోచించమని ఇచ్చిన సలహాతోనే వీర్నపల్లిలో రైలుబండిని, వెంకటాపూర్‌లో పాఠశాలను కోటగా తయారు చేశాను. తాను వేసిన బొమ్మలను చూసి విద్యార్థులు ప్రభుత్వ బడులకు వస్తున్నారు. దీంతో బడులను బతికిస్తున్నాననే సంతృప్తి ఉంది. 

– నారోజు చందు, కళాకారుడు, నర్మాల

ప్రైవేటు బడి మాన్పించిండ్రు 

ప్రైవేటు పాఠశాలకు వెళ్లి చదువుకునే వాడిని. ఊర్లోనే సర్కారు బడికి రంగులు వేసి అందరు బడికచ్చే విధంగా చేశారు. నాసోపతోళ్లు సర్కారు బడికి పోతుంటే వాళ్లను చూసి నేను కూడా ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చేరాను. దీంతో మా తల్లిదండ్రులకు ఖర్చులు కూడా తగ్గినయ్‌. 

– గొట్టె జశ్వంత్, విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement