ర్యాంకు ప్రకారమే రీయింబర్స్‌మెంట్‌? | Sakshi
Sakshi News home page

ర్యాంకు ప్రకారమే రీయింబర్స్‌మెంట్‌?

Published Thu, May 17 2018 3:50 AM

Government Has Not Decided On Full Fees For All BC Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు ఈ ఏడాది కూడా ర్యాంకు ఆధారంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీలందరికీ పూర్తి ఫీజు ఇవ్వాలని బీసీ సబ్‌కమిటీ సిఫార్సు చేసి ఆరు నెలలైనా ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును సర్కారు చెల్లిస్తుండగా.. బీసీల్లో 10 వేలలోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తి ఫీజు ఇస్తోంది. అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి గరిష్టంగా రూ.35 వేలు అందిస్తుండటంతో మిగతా ఫీజును విద్యార్థులు వ్యక్తిగతంగా భరించాల్సి వస్తోంది. దీంతో మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ రాగా.. గతేడాది బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులివ్వాలని తీర్మానించింది. సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆర్నెల్లు్ల గడిచినా పూర్తి ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.  

అవే నిబంధనలు 
బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేబినెట్‌ సబ్‌ కమిటీ గతేడాది డిసెంబర్‌లో ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం 2017–18 విద్యా సంవత్సరం బకాయిలు చెల్లిస్తున్నారు. ఇందులో 10 వేల ర్యాంకు సీలింగ్‌ను అనుసరిస్తూ.. ఆ లోపు ర్యాంకు ఉన్న విద్యార్థులకే పూర్తి ఫీజు ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ర్యాంకున్న వారికి స్లాబుల ప్రకారం చెల్లిస్తున్నారు. మరోవైపు పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల రీయింబర్స్‌మెంట్‌ నిబంధనల్లో మార్పుల్లేవని, గత నిబంధనలే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.  

బీసీల్లోని హిందువులకే కోత
రీయింబర్స్‌మెంట్‌ పథకంలో బీసీ విద్యార్థులకు ర్యాంకు నిబంధన అమలు చేస్తున్నా కొన్ని కులాలకే పరిమితమైంది. బీసీ–బీ కేటగిరీలోని దూదేకుల, నూర్‌బాషా, పింజారి, లద్దాఫ్‌.. బీసీ–సీ కేటగిరీలోని కన్వర్టెడ్‌ క్రిస్టియన్, మైనారిటీ కులాలు, బీసీ–ఈ కేటగిరీ కులాలకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లిస్తోంది. బీసీల్లోని హిందూ కులాలకే ర్యాంకు నిబంధన ఉండటంతో మతాల ఆధారంగా విద్యా పథకాలు వర్తింపజేయడం సరికాదని బీసీ సంక్షేమ, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   

Advertisement
Advertisement