కొత్త రేషన్‌ కార్డులకు మోక్షం

Government Given Green Signal For New Ration Cards - Sakshi

ఈనెల ఒకటో తేదీ నుంచే దరఖాస్తుకు అవకాశం

పాత కార్డుల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు  

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచన

జిల్లాలో రేషన్‌దుకాణాలు                 558
అంత్యోదయ కార్డులు                       17,037
ఆహార భద్రత కార్డులు                      2,11,566
అన్నపూర్ణ కార్డులు                          42  
ప్రతి నెలా సరఫరా చేసే బియ్యం        4,600 మెట్రిక్‌టన్నులు  

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జిల్లాలో కార్డులు జారీ చేయాలని వారం రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆయా జిల్లాల సివిల్‌ సప్లయి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి సమీప మీసేవ కేంద్రాలలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పాత కార్డులలో కూడా అవసరమైన మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. కొత్త కార్డుల ప్రక్రియపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటన కూడా చేశారు. దీంతో ఎట్టకేలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై స్పష్టత వచ్చినట్లయింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కార్డులను మంజూరు చేయలేదు. దీంతో మూడున్నరేళ్లుగా లబ్ధిదారులు కొత్త రేషన్‌కార్డుల కోసం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక దశలో శాశ్వత రేషన్‌ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఆ ప్రక్రియపై నేటికీ ఒక స్పష్టమైన ప్రకటన వెలువర్చలేదు. అదేవిధంగా సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్‌ విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే వెసులుబాటు కల్పించడంతో శాశ్వత రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇక ఉండదనే అధికారులు భావిస్తున్నారు. కేవలం రేషన్‌కార్డు నంబర్‌తో రేషన్‌ పొందే అవకాశం ఉంటుంది.

క్షేత్రస్థాయి ధ్రువీకరణ తప్పనిసరి  
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రేషన్‌కార్డు కేవలం రేషన్‌ తీసుకునేందుకు మాత్రమే కాకుండా ఒక గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. ఆధార్‌ కార్డు అందుబాటులోకి రాక ముందు రేషన్‌కార్డు ప్రాముఖ్యత చాలా ఉండేది. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకునేవారు. దీంతో అప్పట్లో ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్‌కార్డు తీసుకునేందుకు పోటీ పడటంతో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు ఉన్న వారికే కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డును ఇచ్చారు. క్రమేణా రేషన్‌ కార్డు ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుండడంతో కొంతమంది స్వచ్ఛందంగా వీటిని వదులుకున్నారు.

మూడేళ్లుగా రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా వరకు ప్రజలు కొత్త కార్డులను తీసుకోలేకపోయారు. ప్రస్తుతం కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి గ్రామాల్లో వార్షిక ఆదాయం రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆయా గ్రామ వీఆర్వోలు, రేషన్‌ డీలర్లు పరిశీలించిన అనంతరం వాటిని మండల తహసీల్దార్‌ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన వారి జాబితాను చివరగా జిల్లా పౌర సరఫరాల శాఖాధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి డీఎస్‌ఓ ఆమోదిస్తే వారికి కొత్త కార్డు మంజూరవుతుంది. ఏ ఆధారం లేని ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులను మంజూరు చేయనుంది. అత్యంత దీన స్థితిలో ఉన్న వారికి అన్నపూర్ణ కార్డులను ఇవ్వనుంది.  

తహసీల్దార్లకు ఆదేశాలు
జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల వివరాలను పరిశీలించి జాబితా తయారు చేసి పంపాలని ఆయా మండల తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రజావాణిలోనూ రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 558 రేషన్‌షాపులలో 17,037అంత్యోదయ కార్డులు, 2,11,566 ఆహార భద్రత, 42 అన్నపూర్ణ కార్డులు ఉండగా, ప్రతి నెలా 4600 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు.    

అర్హులకే కార్డులు
జిల్లాలో కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అన్ని మీసేవ కేంద్రాలలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తును ఆయా మండల తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పిస్తే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి కార్డులు జారీ చేస్తారు. గ్రామాల్లో కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పే దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు.                 – మోహన్‌బాబు, డీఎస్‌ఓ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top