గోదారి పారే దారేది? | Godavari River Marasmus In Adilabad | Sakshi
Sakshi News home page

గోదారి పారే దారేది?

Jul 30 2018 12:45 PM | Updated on Aug 17 2018 2:56 PM

Godavari River Marasmus In Adilabad - Sakshi

ఎస్సారెస్పీ ఎగువన బాసర వద్ద గోదారి తీరు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా... బాబ్లీ నుంచి దిగువకు నీరు విడుదల కాలేదు... శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌ఎస్‌పీ) పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలకు ప్రస్తుతం ఉన్నది 15.82 టీఎంసీలే...  ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు ప్రాజెక్టులో ఉన్న నీరు 13.489 టీఎంసీలే. ఈ పరిస్థితిల్లో ప్రాజెక్టులను మినహాయిస్తే బాబ్లీ దిగువ నుంచి 300 కిలోమీటర్ల గోదావరి పరీవాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. జూలై నెలలో ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని చెరువుల్లో సైతం నీరు చేరలేదు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ గోదావరి నదీ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయని ఎస్సారెస్పీపై ఆధారపడ్డ రైతాంగం ఎదురుచూస్తోంది.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరిలోని నీటిని వదిలితే తప్ప దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డ హైదరాబాద్‌ ప్రజానీకంతో పాటు సింగరేణి, ఎన్‌టీపీసీ వంటి సంస్థలు, కరీంనగర్‌ పూర్వ జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎ ల్లంపల్లి దిగువన మంచిర్యాల,  పెద్దపల్లి జిల్లాల మధ్య నుంచి సాగే గోదావరి నిర్మాణంలో ఉన్న అన్నారం బ్యారేజీ వరకు ఎడారిని తలపిస్తోంది. ఆగస్టు నుంచి అక్టోబర్‌ లోపు భారీ వర్షాలు, తుపానులు వస్తే తప్ప గోదావరి డెల్టాలో ఎస్సారెస్పీపై ఆధారపడ్డ ఉత్తర తెలంగాణకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవు.

 
ఎస్సారెస్పీలో ప్రమాదకర రీతిలో నీరు
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రజలకు వరప్రదాయినిగా చెప్పుకునే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరుకుంది. అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై నుంచి అక్టోబర్‌ వరకు ఎత్తితే ఎస్సారెస్పీ నిండుతుంది. జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తినప్పటికీ, లక్ష క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయలేదు. ఎగువన బాబ్లీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోకపోవడమే అందుకు కారణంగా ఆ రాష్ట్ర సర్కారు చెపుతోంది.

దీంతో ఎస్సారెస్పీకి ఇటీవలి కాలంలో వచ్చిన నీరు రెండు టీఎంసీలే. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలో గురువారం 15.82 టీఎంసీల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 30 అడుగుల లోటుతో 1061 అడుగులకు చేరుకోవడం ఆందోళన  కలిగిస్తోంది. ఎస్సారెస్పీని నమ్ముకొని ఇప్పటికీ నార్లు పోయని ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల ప్రజలు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.


ఎల్లంపల్లిలో ఆరు టీఎంసీల లోటు 
హైదరాబాద్‌కు తాగునీటితో పాటు కరీంనగర్‌ ప్రాంతానికి సాగునీటిని, సింగరేణి, ఎన్‌టీపీసీ సంస్థలకు నీరు అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ప్రస్తుతం లోటు నీటిమట్టంతో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 668 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీరును వచ్చినట్టే ఔట్‌ఫ్లో చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ వర్క్స్‌కు 280 క్యూసెక్కులు, సింగరేణికి 200 క్యూసెక్కులు, ఎన్‌టీపీసీకి 200 క్యూసెక్కుల వరకు విడుదల చేసే అధికారులు నీటి లోటుతో తగ్గించి వదులుతున్నారు.

గూడెం, వేమునూరు, పెద్దపల్లి–రామగుండం మిషన్‌ భగీరథ సెగ్మెంట్‌కు కూడా ఇక్కడి నుంచే నీరివ్వాలి. వేసవి కాలంలోనే నీటి సరఫరాపై ఆంక్షలు విధించిన ప్రాజెక్టు అధికారులు కేవలం హైదరాబాద్‌కు, సింగరేణి, ఎన్‌టీపీసీలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ కాపాడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదతో ఆరు టీఎంసీల స్థాయి నుంచి 13 టీఎంసీలకు నీటిమట్టం పెరిగినప్పటికీ, పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోకపోతే హైదరాబాద్‌కు నీటి సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు చెపుతున్నారు.

ఎడారిని తలపిస్తున్న గోదావరి
ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎగువకు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నీరు కనిపిస్తుందే తప్ప మిగతా గోదావరి అంతా ఎడారిని తలపిస్తోంది. వర్షాలు కురిసిన తరువాత అక్కడక్కడ నిలిచిన నీటితో ఇసుకలో గడ్డి, పిచ్చిమెక్కలు మొలిచిన తీరు కనిపిస్తోంది. ఎల్లంపల్లి దిగువన నిర్మాణంలో ఉన్న సుందిళ్ల బ్యారేజీ వరకు గల 31 కిలోమీటర్ల దూరంలో సన్నని దార తప్ప గోదావరిలో నీరు లేదు. అక్కడి నుంచి 31.5 కిలోమీటర్ల దూరంలోని అన్నారం బ్యారేజీ వరకు అదే పరిస్థితి.

అన్నారం నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు  ప్రాణహిత వరద పోటెత్తింది. ఇదే పరిస్థితి ఎస్సారెస్పీ నుంచి దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గల 140 కిలోమీటర్లలో ధర్మపురి వరకు ఎడారి పరిస్థితే. ధర్మపురి నుంచి నీటి ప్రవాహం కొంతమేర పెరిగింది. బాసర సరస్వతి చెంతనే నీరు లేని పరిస్థితి. బాబ్లీ దిగువన ఎస్సారెస్పీ వరకు కూడా నీటి ప్రవాహం లేక ఇసుక తిన్నెలు, పిచ్చిమొక్కలు గోదావరిలో కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement