పన్ను–పరిష్కారం

GHMC Special Event For Assets Tax Solutions - Sakshi

ఆస్తిపన్ను వివాదాలపై జీహెచ్‌ఎం ప్రత్యేక కార్యక్రమం

ప్రతి ఆదివారం ఉదయం 9.30 నుంచి ఒంటి గంట వరకు

జీహెచ్‌ఎంసీ అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో...

మార్చి నెలాఖరు వరకు కొనసాగింపు

అందుబాటులో జోనల్, డిప్యూటీ కమిషనర్లు

సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేట సర్కిల్‌లోని ఓ ఇంటి యజమానికి రూ.3580 ఆస్తిపన్నుగా ఉండేది. ఉన్నట్లుండి అది రూ.8200కు పెరిగింది. ఇదేమిటని అధికారుల వద్దకు వెళితే సరైన సమాధానం చెప్పేవారు లేరు. ఆస్తిపన్ను కట్టక పోతే..పెనాల్టీతో మరింత పెరుగుతుందని బెదిరించారు. ఏం చేయాలో పాలుపోని ఆయన సమస్యకు పరిష్కారం దొరకలేదు.
మెహదీపట్నం సర్కిల్‌కు చెందిన మరో ఇంటి యజమానికి ఏకంగా రూ.94,000 బకాయిగా డిమాండ్‌  నోటీసు అందింది. అంత మొత్తం ఎందుకు ఉందో అర్థం కాలేదు. అంతకు ముందే బీపీఎస్‌ కింద రెగ్యులరైజ్‌ చేయించుకున్న ఆయనకు ఇంకా పెనాల్టీలపై పెనాల్టీలు విధిస్తుండటంతో బకాయిలు భారీగా పెరిగాయి. అధికారుల కాళ్లావేళ్లాపడి వేడుకుంటే అన్నీ పరిశీలించి రెగ్యులరైజ్‌ అయినప్పటికీ, పెనాల్టీతో వసూలు చేసినట్లు అంగీకరించారు. అధికంగా కట్టిన మొత్తాన్ని తిరిగి పొందేందుకు తిరిగి దరఖాస్తు  చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసేలోగా ఈ సమాచారం ఇచ్చిన అధికారి బదిలీ అయ్యారు. తిరిగి ఆయన గోడు వినేవారు కరువయ్యారు. నోటీసు మేరకు ఆస్తిపన్ను చెల్లించాల్సిందే అంటున్నారు.

ఇలా జీహె చ్‌ఎంసీ ఆస్తిపన్నుకు సంబంధించి ఎందరివో ఎన్నెన్నో  సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటిని పట్టించుకోని అధికారులు... ఆస్తిపన్ను ఫిర్యాదులు, వివాదాలు, తదితరమైన వాటికి సంబంధించి ఇక నుంచి ప్రతి ఆదివారం మార్చి నెలాఖరు వరకు ‘ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం(పీటీపీ)’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభించి మార్చి 31లోగా వచ్చే అన్ని ఆదివారాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ పేర్కొన్నారు. అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆస్తిపన్ను సంబంధిత ఫిర్యాదులు, ఆస్తిపన్ను మదింపు, కోర్టు కేసులు తదితరమైన వాటికి సంబంధించి అధికారులు ప్రజలకు సహకరిస్తారన్నారు. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, తదితర అధికారులు ఈ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు.  ఆస్తిపన్ను సంబంధిత సమస్యలున్న ఇళ్ల యజమానులు ఈ ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం కార్యక్రమానికి హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

రూ. 524 కోట్ల వసూళ్లు లక్ష్యం..
‘ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం’ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడటమే కాక ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకోవాలనేది జీహెచ్‌ఎంసీ లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.1500 కోట్లు కాగా  ఇప్పటి వరకు రూ. 976 కోట్లు వసూలైంది. ఇటీవలి  ఎన్నికల నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షణ్‌ తదితర కార్యక్రమాల వల్ల వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది అంతా ఆయా విధుల్లో నిమగ్నమయ్యారని కమిషనర్‌ పేర్కొన్నారు. దాంతో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యంలో వెనుకబడ్డామని,  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 40 రోజుల్లో  మిగతా రూ. 524 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యమని వివరించారు. అంటే రోజుకు దాదాపు రూ.13 కోట్లు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆస్తిపన్నును ఏమాత్రం పెంచకుండానే అంతర్గత లొసుగులను సరి చేసుకుంటూ, మదింపుకాని ఆస్తులను ఆస్తిపన్ను జాబితాలో చేర్చడం తదితరమైన వాటి ద్వారా లక్ష్యాన్ని సాధించగలమనే ధీమా వ్యక్తం చేశారు.     

ఈ రోజుల్లో..
ఈ నెల 24 నుంచి మార్చి నెలాఖరు వరకు అంటే..మార్చి 3వ తేదీ, 10వ తేదీ, 17, 24, 31 తేదీల్లో ఆస్తిపన్ను పరిష్కారం కార్యక్రమం ఉంటుంది. ఇందుకుగాను అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా మూడు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు  కమిషనర్‌ తెలిపారు. ఆస్తిపన్ను వివాదాలకు సంబంధించిన రివిజన్‌ పిటిషన్ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించి కోర్టులో ఉన్న పిటిషన్లను కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో  ఆస్తిపన్ను చెల్లింపులకు సంబంధించి సిటీ కోర్టుల్లో 86 కేసులు, హైకోర్టులో 74 కేసులు ఉన్నాయని  పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top