వదల బొమ్మాళీ! | GHMC Retired Contract Employees Still on Duty | Sakshi
Sakshi News home page

వదల బొమ్మాళీ!

Jul 25 2019 12:02 PM | Updated on Jul 29 2019 11:23 AM

GHMC Retired Contract Employees Still on Duty - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగంలోని అధికారులకు ఓ సందేహం వచ్చింది. సమస్యకు పరిష్కారమేమిటో చెప్పేవారు లేరు. ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎసీ యాక్ట్‌.. నిబంధనల మేరకు సంశయాత్మక సందర్భాల్లో తగిన పరిష్కారాలు చూపేందుకు తప్పనిసరి అవసరం కావడంతో ఈ అంశాల్లో నిష్ణాతుడైన, ఓ విశ్రాంత అధికారిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నారు. దాంతో అటు అధికారులకు, ఇటు జీహెచ్‌ఎంసీకి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. అనుభవజ్ఞుల సేవలు అవసరం కావడంతో కాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. అలాగే టౌన్‌ ప్లానింగ్‌లోనూ సంపూర్ణ పరిజ్ఞానమున్న ఒకరిని నియమించారు. ఫైనాన్స్, స్పోర్ట్స్‌ విభాగాల్లోనూ తగిన అనుభవం ఉన్నవారిని రిటైరయ్యాకకాంట్రాక్టు పద్ధతిపై నియమించారు. ఇలాంటి అనుభవం గలవారి సేవలతో జీహెచ్‌ఎంసీకి ఎన్నో ఇబ్బందులు తప్పాయి. వీరి నియామకాలను ఎవరూ తప్పుబట్టలేరు. 

ఇదే అంశాన్ని ఆసరా చేసుకొని పలు విభాగాల్లో రిటైరైన ఉద్యోగులు తిరిగి జీహెచ్‌ఎంసీలోనే కొనసాగేందుకు పైరవీలు ప్రారంభించారు. రాజకీయంగా, అధికారికంగా పైస్థాయిలోని వారి పరిచయాలను అడ్డం పెట్టుకుని ‘కాంట్రాక్టు’పై తిరిగి చేరుతున్నారు. ఒక్కసారి చేరారో అక్కడే అతుక్కుపోతున్నారు. తొలుత మూణ్నెళ్లు, ఆర్నెళ్లు, ఏడాది కాలానికి కాంట్రాక్టుపై చేరిన వారు గడువు ముగియగానే తిరిగి ‘పొడిగింపు’తో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీలో రిటైరైన వారి స్థానంలో ఖాళీలు ఏర్పడుతున్నా కొత్తవారిని నియమించే అవకాశం లేకపోతోంది. జీహెచ్‌ఎంసీ ఏటా దాదాపు రూ.2 కోట్లు ఈ కాంట్రాక్టు నియామకాలకే వేతనాలుగా చెల్లిస్తోంది. ఇక ఔట్‌సోర్సింగ్‌ది మరో కథ. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ఆయా అంశాల్లో తర్ఫీదునివ్వడం, తగిన నైపుణ్యాలు పెంపొందించడం అవసరం. కానీ జీహెచ్‌ఎంసీలో ఆ పని జరగడం లేదు. ఇలాంటి నియామకాలకు ఇది కూడా ఒక కారణం. కొందరి అవసరాన్ని ఆసరా చేసుకొని ఎందరో చేరుతున్నారు. వారైనా సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ, అసలు విధులకు హాజరవుతున్నదీ లేనిదీ సంబంధిత విభాగాల  ఉన్నతాధికారులకే తెలియాలి.  

అవసరం లేని సిబ్బందితో ఆర్థిక భారం
జీహెచ్‌ఎంసీ ఖజానాలో నిధులు లేక ఆర్థిక ఇంబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి నియామకాలు, వారి వేతనాలతో స్థపై ఆర్థిక భారం పెరుగుతోంది.  ఈ సంవత్సరం ఇప్పటి దాకా దాదాపు 30 మంది, గతేడాది 40 మంది.. ఏడాదిన్నర కాలంలో 70 మంది వరకు ఇలా ‘కాంట్రాక్టు’పై చేరినట్లు సమాచారం. వీరికి చెల్లించే వేతనాలు ఒక్కొక్కరికి స్థాయినిబట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టేట్స్, భూసేకరణ, టౌన్‌ప్లానింగ్, ఎన్నికల విభాగాలతో సహా పలు విభాగాల్లో ఇలాంటి నియామకాలు చేస్తున్నారు. వీరిలో చాలామందిని అవసరం లేకపోయినా పునరావాసం కోసం తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జీహెచ్‌ఎంసీ ఇటీవలి కాలంలో ఔట్‌సోర్సింగ్‌పై దాదాపు 400 మంది ఇంజినీర్లను తీసుకుంది. వారిలో చాలామందికి తగిన పని లేకుండానే జీతాలు చెల్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ సర్వే, తదితర పనులకు వారిని వినియోగించుకునే యోచనలో ఉన్నారు. 

అన్ని విభాగాల్లోనూ అదే పరిస్థితి
గతంలో కొన్ని విభాగాల్లోనే రిటైరైన వారిని కాంట్రాక్టుపై తీసుకునేవారు. భూముల కొలతలు, భూసేకరణ వంటి అంశాల్లో తగిన అవగాహన ఉంటుందని రెవెన్యూ విభాగం నుంచి రిటైరైన వారిని తీసుకునేవారు. దీన్ని ఆసరా చేసుకొని తామెందుకు చేరకూడదంటూ అన్ని విభాగాల్లోని వారూ ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో ఒక విభాగమంటూ ఉన్నాక అందులో పనిచేసేందుకు తగిన అవగాహన, సామర్థ్యం ఉన్నవారు లేరనుకోలేం. కానీ లేకనే ఇతరులను తీసుకుంటున్నామని, వారిని తీసుకోకపోతే విభాగమే పనిచేయలేదన్నంతగా బిల్డప్‌ ఇవ్వడం విచిత్రం.   

'ఇలా కాంట్రాక్టుపై నియామకాలు జరిపేటప్పుడు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందాలి. అంటే స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం పొందాకే ఇలాంటి నియామకాలు జరగాల్సి ఉండగా, చాలా సందర్భాల్లో రిటైరైన ఉద్యోగులు కాంట్రాక్టుపై విధుల్లో చేరాక ఆరేడునెలల అనంతరం కూడా స్టాండింగ్‌ కమిటీ ముందుంచి ఆమోదం పొందుతుండటం గమనార్హం. '

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement