
మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందంటారు. అలాగే, అధికారులు ఎక్కువైతే పనులూ మందగిస్తాయని ‘ది గ్రేట్‌జీహెచ్‌ఎంసీ’లో వెల్లడవుతోంది. సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్‌ఎంసీకి సమర్థులైన అధికారులు అవసరమని ప్రభుత్వం భావించి..గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏడుగురు ఐఏఎస్‌అధికారులను, మరో ముగ్గురు అధికారులను ముఖ్యస్థానాల్లో నియమించింది. ఐఏఎస్‌ల సంఖ్య పెరగడంతో అన్ని విభాగాల్లో పనులు పరుగులు తీస్తాయని భావించారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. పనులు వేగిరం కావడం అటుంచితే..కొందరు ఉన్నతాధికారుల వ్యవహార శైలితో ముఖ్యమైన ఫైళ్లు కూడా ముందుకు కదలడం లేదు. ప్రతి పనికీ కొర్రీలు వేస్తూ ఫైళ్లు పెండింగ్‌లో పెట్టే వారి వైఖరితో దిగువస్థాయిలోని వారూ పనులు చేయలేకపోతున్నారు. మొత్తంగాఅధికారుల తీరుతో జీహెచ్‌ఎంసీకి చెడ్డపేరు వస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్.. విశ్వనగరం..డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..రూ.25 వేల కోట్లతో మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి..హరితహారం...ఇలా జీహెచ్‌ఎంసీ చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన ఈ పనులతో జీహెచ్‌ఎంసీ బాధ్యత పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఆయా పనుల్ని పర్యవేక్షించేందుకు పలువురు ఐఏఎస్ అధికారులను జీహెచ్‌ఎంసీకి కేటాయించింది. గతంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కాక ఒకరో, ఇద్దరో మాత్రమే ఐఏఎస్‌లు ఉండేవారు. గత రెండేళ్లలో ఐఏఎస్‌ల సంఖ్య ఏడుకు పెరిగింది. నాన్ ఐఏఎస్‌లతో సహా కలిపి ఆరుగురికిపైగా అడిషనల్ కమిషనర్లుండేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య పదికి చేరింది. రవాణా వంటి విభాగాలను ఐపీఎస్ అధికారికి అప్పగించారు. అడిషనల్ కమిషనర్ల సంఖ్య..వారిలోనూ ఐఏఎస్‌ల సంఖ్య పెరగడంతో అన్ని విభాగాల్లో పనులు పరుగులు తీస్తాయని భావించారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. గతంలో ఒక్కో అడిషనల్ కమిషనర్ నాలుగైదు విభాగాల్ని నిర్వహించేవారు. వీరి సంఖ్య పెరగడంతో ఒక్కో విభాగాన్ని రెండు మూడు భాగాలుగా విభజించారు. ఆ రకంగానైనా పనులు స్పీడందుకుంటాయని, ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయని భావించారు. కానీ..సీన్ రివర్స్ అయింది. పర్యవేక్షించేవారు తక్కువమంది..పనులు చేసేవారు ఎక్కువమంది ఉండటం ఎక్కడైనా సహజం. ఇక్కడ మాత్రం ఉన్నతాధికారులు పెరిగారు. అయినా వారు తమ మేథస్సు జోడించి కొత్త సంస్కరణలు చేపడితే మంచి ఫలితాలు వచ్చేవి. కానీ ప్రస్తుతమున్న అధికారుల్లో అలా పనిచేసే వారు ఒకరిద్దరు మినహా కనిపించడం లేరు. దీంతో ప్రభుత్వం ఏ ఫలితాలు ఆశించి ఎక్కువమంది ఐఏఎస్‌లను జీహెచ్‌ఎంసీకి కేటాయించిందో ఆ ప్రయోజనం నెరవేరలేదు. పైపెచ్చు కొందరి వ్యవహార శైలితో ఫైళ్లు కదలడం లేదు. పనులు ముందుకు సాగడం లేదు. ప్రతి పనికీ కొర్రీలు వేస్తూ ఫైళ్లు పెండింగ్‌లో పెట్టే వారి వైఖరితో దిగువస్థాయిలోని వారు పనులు చేయలేకపోతున్నారు.
ఇంకొందరు తాము స్ట్రిక్ట్ అంటూ రూల్స్ చూపుతూ పనులను పెండింగ్‌లో ఉంచుతున్నారు తప్ప ఫైళ్లను పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయరనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. పైపెచ్చు తాము అస్సలు టైమ్ వేస్ట్ చేయమంటూ ఫోజులిస్తారని, ఎవరైనా ఉద్యోగి ఏదైనా విషయంపై మాట్లాడితే తన సమయం ఐదు నిమిషాలు అనవసరంగా వృథా చేశావంటూ మెమోలు కూడా జారీ చేస్తారని చెబుతున్నారు. ఇక సామాన్య జనం ఎవరైనా వారిని కలిసి తమ బాధలు వెల్లబోసుకోవాలనుకుంటే భ్రమే. ప్రజలను కలవడానికి సుతరామూ ఇష్టపడరు. ఇలాంటి వారి వ్యవహారశైలితో జీహెచ్‌ంఎసీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. జీహెచ్‌ఎంసీకి వివిధ రూపాల్లో రావాల్సినంత ఆదాయమూ రాకుండా పోతోంది. ఏటికేడు పెరగాల్సిన ఫీజుల వసూలు తగ్గిపోతోంది.
పని విభజన తప్ప ఫలితం లేదు..
జీహెచ్‌ఎంసీలో అడిషనల్ కమిషనర్లు ఎక్కువమంది కావడంతో గతంలో ఒక్కరు నిర్వహించిన బాధ్యతల్నే ప్రస్తుతం ఇద్దరు ముగ్గురికి అప్పగించారు. గతంలో ఒక విభాగంలో ఉండే పనులనే విభజించి ప్రత్యేక విభాగాలుగా పేర్కొంటున్నారు. అలా స్వీపింగ్ మెషిన్లు, చెత్త నుంచి విద్యుత్, ఎల్‌ఈడీ లైట్ల సూపర్‌విజన్, ఎన్‌యూహెచ్‌ఎం, కంటివెలుగు, బస్తీ దవాఖానాలు, కో ఆర్డినేషన్, సీఎస్సార్, ఎస్‌డబ్లు్యఎం– హెచ్‌ఐఎంఎస్‌డబ్లు్య, తదితర విభాగాలుగా పేర్లు పెట్టారు. అలాగైనా ఆయా విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించారా అంటే అదీ లేదు. సర్కిళ్లలోని డీసీలు, జడ్‌సీలు, టాక్స్‌సెక్షన్ సిబ్బంది తదితరుల వల్ల ఆదాయం పెరిగితే తమ ఘనతగా చెప్పుకుంటున్నారని, ప్రకటనలు, ట్రేడ్ లైసెన్సుల ఫీజులు తదితర విభాగాల్లో ఆదాయం తగ్గితే మాత్రం కోర్టుకేసులని, ఇతరత్రా సాకులు చెబుతారని ప్రచారంలో ఉంది. వివిధ విభాగాల్లో పేరుకుపోయిన కోర్టు కేసుల్ని పరిష్కరించే ప్రయత్నమే జరగడం లేదని చెబుతున్నారు. ఆస్తిపన్ను సమస్యలు, మ్యుటేషన్లు, బర్త్ సర్టిఫికెట్లు తదితరమైన వాటికోసం ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వాటిని పరిష్కరించకుండా లేనిపోని కొర్రీలు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.5 భోజన కేంద్రాల చుట్టూ చెత్తాచెదారం చేరి కంపు కొడుతున్నా, కొన్ని ప్రాంతాల్లో మురికి నాలాల పక్కనే వాటిని నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.
పేరు గొప్ప..
ఏ అడిషనల్ కమిషనర్‌కు అప్పగించిన బాధ్యతల్ని వారు నిర్వహించాల్సి ఉండగా, వారా పని చేయకపోవడంతో అన్నింటిపైనా కమిషనరే పూనుకోవాల్సి వస్తోంది. వీధుల్లోని చెత్త, పారిశుధ్యం, మటన్ దుకాణాల్లో కల్తీలేని మాంసం, ప్లాస్టిక్ నిషేధం, ఎల్‌ఈడీ వీధిదీపాలు తదితర అన్ని అంశాలపైనా కమిషనరే సమీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఎవరి పరిధిలోని పనుల్ని సంబంధిత అడిషనల్ కమిషనర్ చక్కదిద్దాల్సి ఉండగా ఆ పని జరగడం లేదు. ఎక్కడైనా సమస్య ఉన్నా, తగిన పరిష్కారాలు చూపాల్సి ఉండగా, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజలకు సేవలందించేందుకు సానుకూల వైఖరితో వ్యవహరించాల్సి ఉండగా, పనులు చేయకుండా ఉండేందుకే రూల్స్‌ను చూపే వారు ఇంకొందరు. చిన్న అంశాల్ని బూతద్దంలో చూపుతూ పనులు చేయని వారు కొందరు. సదరు అధికారుల వద్ద పనులు చేయలేక ఉద్యోగులు సతమతమతమవుతున్నారు. వాళ్లు పనులు చేయరు..తమను చేయనివ్వరని ఆయా విభాగాల్లోని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాంటి వైఖరితో జీహెచ్‌ఎంసీలో పలు విభాగాల్లో సేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రసాదరావు సిఫార్సులు బుట్టదాఖలు..
జీహెచ్‌ఎంసీ స్టాఫింగ్ ప్యాటర్న్‌పై ప్రసాదరావు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. దాని మేరకు జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలను 30కి పెంచాల్సి ఉండగా పెంచారు. కానీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు ఆరుగురు చాలని, అందులో ఐఏఎస్‌లు ఇద్దరుంటే చాలునని సిఫార్సు చేసింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం కమిషనర్ కాక ఏడుగురు ఐఏఎస్‌లున్నారు. వీరిలో ముగ్గురు ఇతర విధులతోపాటు వీటిని నిర్వర్తిస్తున్నారు. నలుగురు మాత్రం ప్రధాన కార్యాలయంలోనే పని చేస్తున్నారు. ఇంజినీరింగ్ , టౌన్‌ప్లానింగ్, ఆరోగ్యం విభాగాలతోపాటు రెవెన్యూ, ఎస్టేట్, అడ్వర్టయిజ్‌మెంట్ పన్నులు, లీగల్ విభాగాలను బలోపేతం చేయాల్సిందిగా కమిటీ సిఫార్సు చేసింది. అందుకుగాను అధికారులను నియమించినా ఫలితం కనిపించడం లేదు.
డైనమిజం కాదు.. నిస్తేజం..
కొందరు అడిషనల్ కమిషనర్లు సగటున రోజుకు ఒక్క ఫైల్ కూడా పరిష్కరించడం లేదంటే వారు పని చేయకపోవడమైనా కావాలి.. లేదా వారి పనితీరు తెలిసి ఫైళ్లు రాకపోవడమైనా ఉండాలి. నెల రోజుల్లో కనీసం 30 ఫైళ్లు కూడా ప్రాసెస్ చేయని అడిషనల్ కమిషనర్లున్నారు. అలాంటి విభాగాల్లో..గత నెల 21 నుంచి ఈనెల 21వ తేదీ వరకు ప్రాసెస్ అయిన ఫైళ్ల వివరాలు ఇలా...