ఆదాయం పెంచుతాం.. మరి వాటా ఇస్తారా..?

France Company bargaining with RTC - Sakshi

ఆర్టీసీతో ఫ్రాన్స్‌ కంపెనీ బేరసారాలు

సొంత సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ప్రత్యేక చర్యలకు సిద్ధం

మార్చి ఒకటి నుంచి నెలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: బస్సుల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆదాయా న్ని పెంచుతాం.. అందులో వాటా ఇవ్వండి.. ఇది అంతర్జాతీయంగా శాస్త్రీయ రవాణా విధానాన్ని ఏర్పాటు చేస్తున్న ఫ్రాన్స్‌ కంపెనీ ఆర్టీసీతో చేయబోతున్న బేరమిది. ప్రస్తుతం ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ పరిధిలో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్‌ జోన్, కరీంనగర్‌ జోన్లు లాభాల్లోకి రాగా, హైదరాబాద్‌ సిటీ జోన్‌ మాత్రం తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. తాజా నష్టాలు సంవత్సరానికి రూ.300 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి ఆర్టీసీని గట్టెక్కిస్తానంటోంది ఫ్రాన్స్‌ కంపెనీ. తమ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాల్సిందిగా ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన లుమీప్లాన్‌ అన్న సంస్థ ప్రతినిధులు ఆర్టీసీకి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వటంతో అధికారులు కూడా ప్రయోగాత్మకంగా దాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌–కోఠి మార్గాన్ని పైలట్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కేటాయించారు. నెల పాటు ఆ మార్గం లో ఆ సంస్థ తన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి బస్సులను నిర్వహించనుంది. ఈ ప్రయోగం మార్చి ఒకటి నుంచి ప్రారంభిస్తున్నారు.  

సికింద్రాబాద్‌–కోఠి మార్గంలో.. 
ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌–కోఠి మార్గం లో రూట్‌ నం.40, 86 బస్సులను ఆ సంస్థకు కేటాయించారు. ఈ రూట్లలో తిరుగుతున్న 23 బస్సుల్లో ఆ సంస్థ వెహికల్‌ మౌంటింగ్‌ యూని ట్లు ఏర్పాటు చేస్తోంది. అలాంటి పరికరాలనే ఆ మార్గాల్లోని బస్‌స్టాపుల్లో డిస్‌ప్లే బోర్డులతో అనుసంధానిస్తోంది. ఏ బస్సు ఎంత సేపట్లో వస్తుందనే సమాచారం డిస్‌ప్లే బోర్డుల్లో కనిపిస్తుందని సంస్థ చెబుతోంది. ట్రాఫిక్‌ జామ్స్‌ ను అంచనా వేసుకుంటూ సమయాలను చూపుతుంది. బస్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లోనూ సమాచారం కనిపిస్తుంది. ట్రాఫిక్‌ చిక్కులు, ఇతర కారణాలతో ఒకే నంబర్‌ బస్సులు దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు సూచనలు చేరవేయడం ద్వారా వాటిని మళ్లీ క్రమబద్ధీకరిస్తారు. బస్సులను ఎలా నడపాలి, సిబ్బంది సమయా న్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి.. తదితరాలతో ప్రయాణికులకు చేరువ చేయటం దాని ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

ప్రయోగం ఫలిస్తే బస్సులన్నీ..
నిర్ధారిత మార్గాల్లో పరిశీలించి ఎంత ఆదాయం పెరుగుతుందో నిర్ధారించుకున్న తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ఆ సంస్థ అడిగే మొత్తం ఆమోదయోగ్యమా కాదా అని ఆలోచించనున్నారు. అనంతరం సిటీలో మొత్తం బస్సులను ఆ సంస్థ సాఫ్ట్‌వేర్‌ పరిధిలోకి తేవాలా వద్దా నిర్ణయించనున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top