విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల డిగ్రీ హానర్స్‌

Four Year Honours degree for Students Going To Abroad - Sakshi

బీఎస్సీ డేటా సైన్స్, బీకామ్‌ అనలిటిక్స్‌లో నాలుగేళ్ల హానర్స్‌ కోర్సు

ఓయూ మాజీ వీసీ రాంచంద్రం నేతృత్వంలో సిలబస్‌ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ విద్యకు దీటుగా సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఉన్నత విద్యా మండలి డిగ్రీలో బీఎస్సీ డాటా సైన్స్, బీకాం అనలిటిక్స్‌ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉద్యోగ, ఉపాధికి వెళ్లేవారికోసం, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం బీటెక్‌ తరహాలోనే నాలుగేళ్ల డిగ్రీ హానర్స్‌ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. బీఎస్సీ డాటా సైన్స్‌ హానర్స్‌ (నాలుగేళ్ల కోర్సు), బీకాం అనలిటిక్స్‌ హానర్స్‌ (నాలుగేళ్ల కోర్సు) డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు బీటెక్‌ తరహాలో నాలుగేళ్ల డిగ్రీ చదివి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో ఈ కోర్సులు అనుమతి పొందిలేవు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులకు సిలబస్‌ను రూపొందించి, యూనివర్సిటీల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో ఆమోదం తీసుకుని ప్రవేశ పెట్టేలా కసరత్తు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ఆర్‌.రామచంద్రం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

ఈనెల 14వ తేదీన కమిటీ సమావేశం జరగనుందని, అందులో సిలబస్, ఇతరత్రా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సిలబస్‌కు సంబంధించి, డిగ్రీ కాలేజీల్లో ఈ సిలబస్‌ను బోధించే అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్‌ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన టీసీఎస్‌తో తాము ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు.

ఈ కోర్సులను రాష్ట్రంలోని 50 వరకున్న అటానమస్‌ కాలేజీలతోపాటు, పలు ప్రభుత్వ కాలేజీలు, నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలో తాము కోరుకున్న కోర్సును చదువుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top