
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. మొదటి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు సోమవారం ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. ఆ వెంటనే తొలి విడత నామినేషన్ల అంకం ప్రారంభం కానుంది. తర్వాత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరి శీలన ముగించి ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిం చనున్నారు. 11న సాయంత్రం 5 వరకు నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరించి, 12న వాటిని పరిష్కరించనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు 13న మధ్యాహ్నం 3 గంటలకు ముగి యనుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తా రు. 21న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు తొలి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి అప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నికలు జరపనున్నా రు. తొలి విడతలో 39 రెవెన్యూ డివి జన్లు, 197 మండలాల పరిధిలో పం చాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
వారందరికీ ఓటు.. జనవరి 1 నాటికి ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే అవకాశం లభించనుంది. జనవరి 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున, ఆ తేదీ నాటికి ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని తుది ఓటర్ల జాబితాలను తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచిం చింది. 7న తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది.