అరకొర వేతనాలు.. భద్రతలేని బతుకులు | Sakshi
Sakshi News home page

అరకొర వేతనాలు.. భద్రతలేని బతుకులు

Published Sat, Mar 3 2018 3:48 AM

Fee reimbursement funds are college of financial problems - Sakshi

ఎంటెక్‌ పూర్తి చేసిన ఆనంద్‌కుమార్‌ ఖమ్మంలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. కొంతకాలం వేతనాలు బాగానే ఇచ్చారు. కానీ ఏడెనిమిది నెలలగా జీతం రావడం లేదు. అదేమంటే ఫీజు బకాయిలు రావాల్సి ఉంది. వచ్చాక ఇస్తాం.. లేదంటే మీ ఇష్టం అని యాజమాన్యం తేల్చి చెబుతోంది. నల్లగొండలోని ఓ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌దీ ఇదే పరిస్థితి.

హైదరాబాద్‌ శివారులోని కొద్దిగా పేరున్న ఇంజనీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ వేతనం నెలకు రూ.90 వేలుగా మాట్లాడుకున్నారు. యాజమాన్యం ఆయన ఖాతాలో మొత్తం వేతనం వేస్తున్నా.. అందులోంచి రూ.40 వేలు వెనక్కి తీసుకుంటోంది. వేరే కాలేజీలకు వెళితే ఈ మాత్రం వేతనం కూడా ఇచ్చే పరిస్థితి లేక అక్కడే కొనసాగుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ..వీరిదే కాదు.. రాష్ట్రంలోని చాలా వృత్తి విద్య కాలేజీల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు అందక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కాలేజీలు కొన్ని అయితే... సరిగా వేతనాలు చెల్లించని యాజమాన్యాలు మరికొన్ని. మొ త్తంగా కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కష్టాలు వచ్చిపడ్డాయి. ఇలా 2 లక్షల మంది వరకు సిబ్బంది ఇబ్బం ది పడుతున్నట్లు అంచనా. ఇక అఖిల భార త సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కొత్తగా తెచ్చిన నిబంధనతో వేలాది మంది ఫ్యాకల్టీ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

‘ఫీజు’నిధులు అందక..
రాష్ట్రంలో మూడు వేల వరకు సాంకేతిక, వృత్తి విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఉండగా.. అందులో రెండు వేలకుపైగా ప్రైవేటు కాలేజీలే. ఇందులో సుమారు 1,100 కాలేజీల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు సరిగా ఇవ్వడం లేదని అంచనా. నాలుగైదు నెలల నుంచి 10 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లోనే ఉంటున్నట్లు ఫ్యాకల్టీ అసోసియేషన్‌ కూడా చెబుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసిన ప్రతిసారి.. యాజమాన్యాలు బోధనా సిబ్బందికి సగం, బోధనేతర సిబ్బందికి నాలుగో వంతు బకాయిలు మాత్రమే చెల్లిస్తున్నాయని, దాంతో తాము ఇబ్బంది పడాల్సివస్తోందని పేర్కొంటోంది. మరోవైపు ప్రభుత్వం సకాలంలో ఫీజు నిధులు చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి కాలేజీలను నడపాల్సి వస్తోందని, వడ్డీ భారంగా మారుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో మంచి ఫ్యాకల్టీని కోల్పోవాల్సి వస్తోందని అంటున్నాయి.

ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి
ఇప్పటికే అరకొర వేతనాలతో అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో.. బోధన సిబ్బందికి మరో శరాఘాతం తగిలింది. ఏఐసీటీఈ కాలేజీల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1ః15 నుంచి 1ః20కి పెంచడంతో బోధనా సిబ్బంది అవసరం తగ్గింది. దాంతో బోధనా సిబ్బందిని తగ్గించుకునేందుకు కాలేజీల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఫ్యాకల్టీకి నోటీసులు జారీ చేస్తున్నాయి. దీంతో దాదాపు 5 వేల మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

జీతాల్లేకుండా బతికేదెలా?
‘‘వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా బతకాలి. ఫీజు బకాయిలు ఆలస్యంగా వస్తాయని తెలుసు. అయినా జీతాల చెల్లింపునకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేయడం లేదు..’’    
    – కె.రవిప్రకాశ్, ఫ్యాకల్టీ

పాత విధానం కొనసాగించాలి
‘‘ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తిని తిరిగి 1ః15కు తగ్గించాలి. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిపై పోరాటం చేస్తాం..’’
– బాలకృష్ణారెడ్డి, ప్రైవేటు ఫ్యాకల్టీ అసోసియేషన్‌ అధ్యక్షుడు

Advertisement
Advertisement