రైతు సంక్షేమమే ధ్యేయం

The farmer's welfare is the goal - Sakshi

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సోన్‌లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం 

సోన్‌(నిర్మల్‌) : రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ అభివృద్ధే మిగతా అన్ని రంగాల అభివృద్ధికి నాంది అనే భావనతో సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు 125 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు. జిల్లా సహకార అధికారి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రాల్లో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ట్రాన్స్‌పోర్టు వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ధాన్యం రవాణాకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించినట్లు తెలిపారు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ. 1.590 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ నల్లా వెంకట్‌రామిరెడ్డి, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, ఆత్మ చైర్మన్‌ నర్సారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రమేశ్‌రెడ్డి, సర్పంచ్‌ కృష్ణప్రసాద్‌రెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్, సర్పంచులు పాల్గొన్నారు. 

‘డబుల్‌’ ఇళ్లకు శంకుస్థాపన

మండలంలోని కూచన్‌పెల్లి గ్రామంలో చేపట్టిన 30 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ చేశారు. గ్రామానికి అదనంగా 25 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ బండి లింగన్న, ఈఈ సుదర్శన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top