రైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్త

Farmer itself is an entrepreneur - Sakshi

అందుకనుగుణంగా వ్యవసాయరంగంలో సంస్కరణలు

కొలమానాలు నిర్ధారిస్తూ రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదన

ఆ ప్రకారం రాష్ట్రాలకు మార్కులు..ర్యాంకులు.. నిధులు

ఆరు కీలక అంశాల ఆధారంగా వెయిటేజీ నిర్ధారణ

ప్రతిపాదనలపై రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నాక మార్గదర్శకాలు 

సాక్షి, హైదరాబాద్‌: రైతును ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంస్కరణలకు రంగం సిద్ధం చేస్తుంది. అగ్రి బిజినెస్‌ వైపు వారిని మళ్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. అప్పుడే సాగు లాభసాటిగా ఉంటుందనేది కేంద్రం ఆలోచన. చైనాసహా అనేక దేశాల్లో వ్యవసాయం బతుకుదెరువు రంగం కాదు. ఇతర పారిశ్రామికరంగాల్లో భాగంగా అభివృద్ధి చెందింది. దేశంలో వ్యవసాయాన్ని అలా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం భూమికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలపై తెలంగాణసహా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించాక అగ్రి బిజినెస్‌ వైపు రైతును ఎలా మళ్లించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుందని రాష్ట్రానికి పంపిన ప్రతిపాదనల్లో తెలిపింది. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి వాటి అభిప్రాయాలే ఇందులో కీలకం కానున్నాయి.  

ఆరు అంశాలు, మార్కులు, ర్యాంకులు 1
వ్యవసాయాన్ని ఉత్పత్తి కోణంలోనే చూడకూడదనేది కేంద్రం ఆలోచన. దేశం ఆహార భద్రత సాధించడంతోపాటు రైతును ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్ది అతని ఆదాయమార్గాలను పెంచాలని యోచిస్తోంది. ఉత్పత్తి, ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ధర, సాగు, ఉత్పత్తి ఖర్చు తగ్గించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలన్నది మరో కీలక అంశం. దానికి అనుగుణంగానే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా రైతులను తీర్చిదిద్దాలి. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలి. అందుకోసం రాష్ట్రాలను వివిధ అంశాల్లో మార్కుల ప్రాతిపదికన అగ్రి బిజినెస్‌లో అవి చేస్తున్న కసరత్తును అంచనా వేస్తారు. మార్కెటింగ్‌ సంస్కరణలకు 25 మార్కులు కల్పించారు. అందులో కేంద్రం 2017లో తీసుకొచ్చిన మార్కెటింగ్‌ యాక్టును రాష్ట్రంలో అమలు చేస్తున్నారా లేదా పరిశీలిస్తారు. అలాగే ఈ–నామ్‌ అమలు తీరును అంచనా వేస్తారు. పంట కోతల అనంతరం అవసరమైన చర్యల కోసం చేపట్టే మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాలను కొంటున్నారా లేదా చూస్తారు. ఇవన్నీ సక్రమంగా అమలు చేసేట్లయితే ఆయా రాష్ట్రాలకు 25 మార్కుల వెయిటేజీ లభిస్తుంది. 

2వ అంశం
సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటే 20 మార్కుల వెయి టేజీ లభిస్తుంది. అందులో సేం ద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. భూసార కార్డుల పంపిణీ, సూక్ష్మసేద్యంతో వ్యవసాయం చేసే అంశాలను పరిశీలిస్తారు. 

3వ అంశం
భూ సంస్కరణలకు 20 మార్కులు వెయి టేజీ కల్పించారు. కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. భూమి లీజుకు సంబంధించి అంశాలను సరళతరం చేయడం, రైతులను సంఘటితం చేయడం, సమగ్రంగా నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి.  

4వ అంశం
వ్యవసాయంలో రిస్క్‌ను తగ్గించేందుకు 15 మార్కులు వెయిటేజీ ఇచ్చారు. అందులో పంటల బీమా పథకాన్ని అమలుచేయడం, పశువులకు బీమా కల్పించడం చేయాలి.  

5వ అంశం
ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి 10 మార్కులు కేటాయించారు. అందులో నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, విత్తన చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుచేయాలి. నిక్కచ్చిగా నీటిపారుదల వసతి కల్పించాలి. వ్యవసాయ యాంత్రీకరణ అమలుచేయాలి. 

6వ అంశం
వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. రైతులకు విరివిగా రుణాలు అం దజేయాలి. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలి. గ్రామీణ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top