ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి..

Fans And Acs Not Working in Government Hospitals - Sakshi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానిపైగా పని చేయని ఫ్యాన్లు, ఏసీలు

ఐసీయూలు, ఆపరేషన్‌ థియేటర్లలోనూ ఇదే పరిస్థితి

రోగులే స్వయంగా ఫ్యాన్లను సమకూర్చుకుంటున్న వైనం

ఏదైనా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతున్నారా..? అయితే మీ వెంట కచ్చితంగా ఓ ఫ్యాన్‌ కూడా తీసుకువెళ్లండి.. లేకపోతే అక్కడ మీరు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఎందుకంటే నగరంలో పేరుమోసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానికిపైగా ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం లేదు.. మీరు ఒక రోగంతో ఆసుపత్రికి వెళితే.. మరో రోగంతో బయటకు రావాల్సి వస్తుంది. మన ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరు దారుణంగా ఉంది..!          

సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతుంటే.. ప్రభుత్వాసుపత్రులలో ఫ్యాన్లు, ఏసీలు పని చేయకపోవడంతో రోగులు చుక్కలు చూస్తున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రతిష్టాత్మాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పని చేయకుండా పోయిన ఏసీలు, ఫ్యాన్లను ఎప్పటికప్పుడు రిపేర్లు నిర్వహించి అందుబాటులోకి తీసుకురావాల్సిన వైద్యాధికారులు ఇవేవీ పట్టించుకోక పోవడంతో రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

కట్లు, కుట్లకు ఇన్‌ఫెక్షన్ల బెడద..
ప్రతిష్టాత్మాక ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలోని పాత భవనం సహా కులీకుతుబ్‌షా భవనం, ఓపీ భవనాలు ఉన్నాయి. ఇక్కడ అధికారికంగా 1168 పడకలు ఉండగా, అనధికారికంగా 1385 పడకలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ఓపీకి రోజుకు సగటున 2500 మంది వస్తుండగా, మరో 1400 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే ఒకటి, రెండో అంతస్థులను ఖాళీ చేయించి, ఆయా పడకలను గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే సర్దుబాటు చేశారు. విశాలమైన ప్రదేశంలో ఉండాల్సిన పడకలు ఇరుకుగా.. కనీసం గాలి వెలుతురు కూడా సోకని ప్రదేశంలో ఉండిపోయాయి. అసలే ఉక్కపోత ఆ పై వార్డుల్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గాయాలకు కట్టిన కట్లకు, సిజేరియన్‌ ప్రసవాలు, ఇతర సర్జరీల  సమయంలో వేసిన కుట్లు వద్ద ఉక్కపోతతో చెమట పొక్కులు వస్తున్నాయి. దురద పెట్టడంతో వాటిని గిల్లుతుంటారు. సర్జరీ తర్వాత నాలుగైదు రోజుల్లో మానాల్సిన కుట్లు, ఇతర గాయాలు ఉక్కపోత, చెమట పొక్కులతో దురద రావడం, వాటిని గిల్లడం వల్ల వారం పది రోజులైనా మానడం లేదు. అంతేకాదు ఇన్‌ఫెక్షన్ల బారీ నుంచి రోగులను కాపాడేందుకు మోతాదుకు మించి యాంటిబయోటిక్స్‌ వాడాల్సి వస్తోంది. పరోక్షంగా రోగుల ఆరోగ్యం మరింత దెబ్బతినడాకి కారణమవుతోంది.

కంప్యూటర్లు, వైద్యపరికరాలకు ముప్పు
ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్‌ ఆసుపత్రిలో అధికారికంగా 1012 పడకలు ఉండగా, అనధికారికంగా రెండువేల పడకలు కొనసాగుతున్నాయి. అత్యవసర విభాగం సహా ఇంటెన్సీవ్‌కేర్‌ యూనిట్లలోనూ ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో రోగులే కాదు ఆయా విభాగాల్లోన్ని కంప్యూటర్లు, వైద్యపరికరాలు వేడిమికి దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 2400 వైద్యపరికరాలు ఉండగా, ప్రస్తుతం వీటిలో 525 వైద్యపరికరాలతో పాటు అనేక కంప్యూటర్లు పని చేయడం లేదు. పోస్ట్‌ ఆపరేటీవ్, గైనకాలజీ, పీడీయాట్రిక్‌ విభాగాల్లోని రోగులు ఉక్కపోతకు తట్టుకోలేకపోతున్నారు. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రి, నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం సహా సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోని రోగులు సైతం ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడు వీటికి రిపేర్లు నిర్వహించి, వినియోగంలోకి తీసుకురావాల్సిన ఆసుపత్రి యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.  

నగదు తీసుకునే నిమ్స్‌లోనూ అంతే..
ఉస్మానియా, గాంధీ ఇతర ధర్మాస్పత్రులతో పోలిస్తే నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (నిమ్స్‌) కొంత భిన్నమైంది. స్వయంప్రతిపత్తి కలిగిన ఆస్పత్రి ఇది. ఇక్కడ ఉచిత సేవలు ఉండవు. డబ్బు చెల్లించే రోగులకు మాత్రమే ఇక్కడ సేవలు అందుతాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులతో పోలిస్తే వైద్య ఖర్చులు కొంత తక్కువగా ఉండటమే కాదు మెరుగైన వైద్యం అందు తుందనే ఆశతో రోగులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ జనరల్‌ వార్డులతో పాటు పేయింగ్‌ రూమ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఏసీ రూమ్‌లు కూడా ఉన్నాయి. నగదు చెల్లించినప్పటికీ గదుల్లో ఏసీలు పని చేయడం లేదు. షేరింగ్‌ రూముల్లోనూ ఫ్యాన్లు తిరగడం లేదు. ఆసుత్రిలో ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ కోసం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. వసతులు మాత్రం మెరుగుపడటం లేదు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంతే..
నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, ఫీవర్, సరోజినిదేవి కంటి ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, ఛాతి ఆసుపత్రి సహా సుల్తాన్‌ బజార్, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోనే కాదు.. రోగులు నగదు చెల్లించి చికిత్సలు పొందే నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (నిమ్స్‌) లోనూ నిర్వహణ లోపం వల్ల సగానికి పైగా ఫ్యాన్లు, ఏసీలు పని చేయడం లేదు. దీంతో రోగులు ఉక్కపోతకు చెమట, దురద, ఇన్‌ఫెక్షన్ల సమస్య తలెత్తడమే కాదు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వైద్యపరికరాలు, కంప్యూటర్లు పాడైపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top