ప్రభుత్వాస్పత్రుల్లో ‘నకిలీలు’

Fake Employees in Osmania Hospital - Sakshi

ప్రభుత్వాస్పత్రుల్లో రెగ్యులర్‌ ఉద్యోగుల స్థానంలో ఇతరులు  

ఆపరేషన్‌ థియేటర్లలోనూ వారే...  

అండగా నిలుస్తున్న హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు  

ఉస్మానియా, నిలోఫర్‌లో మరీ దారుణం  

‘బయోమెట్రిక్‌’ లేకపోవడంతోనే ఈ దుస్థితి  

నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్‌చల్‌ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్‌ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో వైద్యులకు పట్టుబడడంతో దందా వెలుగు చూసింది. ఈ ఒక్క ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం.   

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నకిలీ ఉద్యోగులు హల్‌చల్‌ చేస్తున్నారు. కొంతమంది నాలుగో తరగతి రెగ్యులర్‌ ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా వారి స్థానంలో ఇతరులను పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో ఓ నకిలీ ఉద్యోగి మద్యం మత్తులో హల్‌చల్‌ చేసి వైద్యులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు పొక్కింది. ఒక్క ఈ ఆస్పత్రిలోనే 15 మంది నకిలీలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఓ అంతర్గత విచారణలో తేలినట్లు సమాచారం. ఆస్పత్రిలో 240 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తుండగా, వీరిలో 28 మంది లాంగ్‌లివ్‌లో ఉన్నారు. కొంతమందికి ఉద్యోగంతో పాటు ప్రైవేటు మందుల దుకాణాలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ఇతర వ్యాపారాలు ఉండడం.. మరికొంత మంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరు విధులకు హాజరుకాకపోగా వారి స్థానంలో ఇతరులకు తక్కువ మొత్తంలో నెలసరి వేతనాలు చెల్లించి ఆస్పత్రులకు పంపుతున్నారు. వీరిలో చాలా మందికి వైద్యంపై కనీస అవగాహన లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు అసలు ఆస్పత్రికి రాకపోయినా వచ్చినట్లు హాజరు నమోదు చేసి, అకౌంట్లలో వేతనాలు జమ చేయిస్తున్నారు. ఇందుకు సహకరించిన హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌లకు భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నట్లు తెలిసింది. 

ఒకరి పేరుతో మరొకరు...  
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రి, ఛాతి, మానసిక చికిత్సాలయం, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, కింగ్‌కోఠి, మలక్‌పేట్, వనస్థలిపురం, గోల్కొండ, కొండాపూర్, నాంపల్లి ఏరియా ఆస్పత్రులు సహా మరో వందకు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 30వేల మంది పని చేస్తున్నారు. పేషెంట్‌కేర్‌ ప్రొవైడర్స్‌ సహా శానిటేషన్‌ సెక్యురిటీ విభాగాల్లో మరో 10వేలకు పైగా సిబ్బంది ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి ఆయా ఆస్పత్రుల్లో బయోమెట్రిక్‌ హాజరు సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. విధులకు గైర్హాజరయ్యే వారిని ఇట్టే గుర్తించడంతో పాటు వేతనాల చెల్లింపును నిలిపివేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ ప్రతిపాదికన పనిచేస్తూ నెలకు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులకు సీనియర్‌ ఆర్‌ఎంఓలు రోస్టర్, డ్యూటీలు వేసి, వారి హాజరును పర్యవేక్షిస్తుండగా... నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరును హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. వీరు కిందిస్థాయి ఉద్యోగుల నుంచి భారీగా ముడుపులు తీసుకుంటూ విధులకు గైర్హాజరైన వారిని సైతం హాజరైనట్లు రికార్డుల్లో చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఆస్పత్రిలోనే ఉండరు...  
ప్రతిష్టాత్మక నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం నిలోఫర్‌లో ఉద్యోగుల విధి నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. నిత్యం వెయ్యి మంది చిన్నారులు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో 18 మంది ఆర్‌ఎంఓలు ఉన్నప్పటికీ.. ముగ్గురు మినహా మిగిలిన వారంతా వేళకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 10:30గంటల తర్వాత ఆస్పత్రికి రావడం, మధ్యాహ్నం 2గంటల తర్వాత వెళ్లడం వీరి పని. ఇక నైట్‌డ్యూటీలోనూ రెగ్యులర్‌ ఉద్యోగులు కన్పించడం లేదు. కీలకమైన విభాగాల్లోనూ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందే దర్శనమిస్తున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులకు రోస్టర్‌ విధానంతో పాటు డ్యూటీలు వేయాల్సిన బాధ్యతతో పాటు రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల హాజరు నమోదు బాధ్యత హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లపై ఉంది. కానీ ఇక్కడి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు రాత్రి విధులకు గైర్హాజరవుతున్నారు. వారి స్థానంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో పని చేయిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. నవజాత శిశువులు చికిత్స పొందే కీలకమైన ఈ ఆస్పత్రితో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు కొనసాగు తోంది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top