
సాక్షి, హైదరాబాద్: రోడ్డుపై వాహనాల సంఖ్య పెరిగితే ట్రాఫిక్ జాం అవుతుంది.. ఆ సమయంలో వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రమాదాలకూ అవకాశం కలుగుతుంది. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేదీ ఇదే పరిస్థితి! ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ను గరిష్ట సామర్థ్యాన్ని మించి వినియోగించుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే... తిరగాల్సినవాటి కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో రైళ్లను పరుగులు పెట్టిస్తోంది. తాజాగా దసరా నేపథ్యంలో అత్యధిక సంఖ్యలో రైళ్లను తిప్పింది. వీలైనన్ని అదనపు రైళ్లను పట్టాలెక్కించింది. ఇప్పుడు ఇదే అంశాన్ని కొందరు అధికారులు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఎక్కడో ఓ చోట మానవ తప్పిదం తలెత్తితే భారీ ప్రమాదాలకు ఆస్కారం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమైన మార్గాల్లో రెండు, మూడో లైన్ల నిర్మాణంలో జాప్యాన్ని నివారించగలిగితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని బోర్డు ముందుంచినట్టు తెలిసింది. జాప్యం అంశంపై కొత్త రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా దృష్టి సారించనున్నట్టు సమాచారం.
ఆదాయం సరే.. కానీ..
ఈసారి వినాయక చవితి, దసరా కలిసి వచ్చిన సెప్టెంబర్ నెలలో దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్ రైళ్లు కాకుండా 123 ప్రత్యేక రైళ్లను నడిపింది. రూ.7.70 కోట్ల అదనపు ఆదాయం ఆర్జించింది. ఉన్న రైళ్లకు అదనంగా 540 బోగీలను ఏర్పాటు చేసి మరో రూ.1.90 కోట్ల ఆదాయాన్ని పొందింది. గతేడాది దసరా, దీపావళి అక్టోబర్‌లో వచ్చాయి. ఈ రెండు పండుగలకు కలిపి 132 అదనపు రైళ్లు నడిపారు. ఈసారి ఇంకా దీపావళి రాకుండానే 123 అదనపు రైళ్లను నడపడం గమనార్హం. గతేడాది అదనపు ఆదాయం కేవలం రూ.5.80 కోట్లు. ఈసారి దసరాకే అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. కానీ.. అదే సమయంలో రైళ్ల ట్రాఫిక్ తీవ్రంగా ఉన్న లైన్లపై అన్ని అదనపు రైళ్లను నడపటం చర్చనీయాంశమైంది. బల్లార్షా, విజయవాడ వైపు మూడో మార్గం పూర్తి కావాల్సి ఉన్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో రెండేళ్ల తర్వాతగాని ఇది అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. నడికుడి, బెంగళూరు, నిజామాబాద్ మార్గాల్లోనూ అంతే. మహబూబ్‌నగర్, నిజామాబాద్ మార్గాల్లో ఇంకా సింగిల్ లైనే వాడుతున్నారు. ఈ లైన్ల నిర్మాణం విషయంలో అధికారులు వేగాన్ని పెంచకపోవటంతో ప్రమాదకర పరిస్థితిలో అదనపు రైళ్లను నడపాల్సి వస్తోంది.