‘కూలీ’న బతుకులు

Employment Guarantee Scheme Laborers Are Migration - Sakshi

పలు గ్రామాల్లో ప్రారంభం కాని ఉపాధి పనులు

 లక్షల్లో కూలీలుంటే.. పని మాత్రం వేల మందికే.. 

గ్రామాల నర్సరీల్లో మొక్కల  పెంపకం పనులతోనే సరి

పనులు కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు

‘కరువు పనులు’ లేక  వలస బాట పట్టిన ప్రజలు

వంద రోజులు పని దినాలు కల్పించాలని ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం జిల్లాలో నీరుగారిపోతోంది.  జిల్లాలో ఇప్పటికే కరువుకాటకాలు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో ఉపాధి పనితోనైనా.. నాలుగు మెతుకులు తిందామంటే ఆ పనులు కూడా అందరికీ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. లక్షలాది మంది కూలీలు ఉండగా వేలాదిమంది కూలీలకే పనులు కల్పిస్తున్నారు.  దీంతో చేసేదేమీ లేక జిల్లా కూలీలు  వలసబాట పడుతున్నారు.   

మెదక్‌ : జిల్లాలో వర్షాలు లేవు. భూగర్భ జలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి. వెరసి వ్యవసాయం  మూలన పడింది. కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసల నివారణకు తోడ్పడాల్సిన  ఉపాధిశాఖ అధికారులు  పల్లెలో కేవలం నర్సరీల ఏర్పాటుతోనే సరిపెడుతున్నారు.  జిలాలో 7,68,271 మంది జనాభా ఉన్నారు. 1,81,342 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,05,104 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరందరికీ ఏడాదికి 100 రోజుల పాటు పని కల్పించాల్సి ఉండగా  80శాతం గ్రామాల్లో ఉపాధి పనులు జరగడం లేదు.  కానీ  మెజార్టీ గ్రామ పంచాయతీలు నర్సరీల్లో మొక్కలను పెంచే పనిలో నిమగ్నమయ్యారు. మొక్కలను పెంచేందుకు కేవలం  10 మంది కూలీలకు మించి ఉపాధి దొరకడం లేదు. దీంతో పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు.

10 వేల మందికి మాత్రమే..

320 గ్రామ పంచాయతీల్లో ప్రతీ గ్రామం పరిధిలో వన నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా 4,05,104 మంది కూలీలు ఉండగా సుమారు 10,955 మంది కూలీలకు మాత్రమే ఈ నర్సరీల ఏర్పాటులో పని దొరకుతోంది. ఈ లెక్కన 3,94,149 మందికి పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో ఉన్న ఊళ్లో పనులు దొరక్క పొట్ట చేతబట్టుకొని వలసలు వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు పని చేస్తున్నారు.

అదనపు భత్యం మాటే లేదు..

ఉపాధి కూలీలకు వేసవికాలంలో ప్రతి ఏటా ఐదు నెలల పాటు అదనపు భత్యం అందించాల్సి ఉంది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు 20 నుంచి 30 శాతం అదనంగా కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన  ఉత్తర్వులు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ ఊసే కానరావడం లేదు. వారం రోజులుగా జిలాల్లో 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  దీంతో పనులు చేసే అతికొద్ది మంది కూలీలకు సైతం ఆ భత్యం అందడం లేదని ఆవేదన చెందుతున్నారు.

పనులు లేక పస్తులుంటున్నాం..

నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు బోర్లు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేక పోవడం, ఎండలు ప్రారంభం కావడంతో ఆ రెండు బోర్లు నీళ్లు పోయడం లేవు.  ఉపాధి హామీలో ఇచ్చే కరువు పనులు చేద్దామంటే  మా గ్రామంలో ఇప్పటికి ఉపాధి పనులు ప్రారంభం కాలేదు.  సార్లను అడిగినా ఫలితం లేకుండా పోతోంది. ఇక పట్నం బతుకుదెరవు పోయేందుకు సిద్ధమౌతున్నం.     –జాల దుర్గయ్య , పాతూర్‌

జనాభా 7,68,271
జాబ్‌ కార్డులు 1,81,342
కూలీలు 4,05,104
పని చేస్తున్న కూలీలు 10,955(సుమారు) 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top