హరితహారానికి ‘ఉపాధి’ నిధులు

Employment Guarantee Scheme funds to harithaharam - Sakshi

అధికారులకు సీఎం ఆదేశం

గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని సూచన

కార్యక్రమం అమలుపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనులు మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతి దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేయించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీనికి సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ఆదివారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమీక్షించారు. ‘‘కొత్తగా ఏర్పాటు చేసుకున్న వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఒక్కో గ్రామాన్ని ఒక్కో యూనిట్‌గా తీసుకోవాలి. ప్రతి గ్రామంలో నర్సరీ పెంచాలి. నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయడం, వాటిని పంపిణీ చేయడం, గుంతలు తీయడం, నీళ్లు పోయడం లాంటి పనులన్నీ వ్యవసాయ కూలీలతో చేయించండి. నరేగా నిబంధనలు కూడా ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని కచ్చితంగా చెప్పాయి. కాబట్టి నరేగా నిధులను తెలంగాణ హరితహారం కోసం వినియోగించడం సముచితంగా, ఉభయ తారకంగా ఉంటుంది’’ అని సీఎం చెప్పారు.

పచ్చదనం తిరిగి రావాలి...
అడవులు, చెట్ల నరికివేత వల్ల గ్రామాల్లో కోల్పోయిన పచ్చదనం, పర్యావరణం హరితహారంతో తిరిగి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ‘‘అడవులు నాశనం కావడం వల్ల అనేక అనర్థాలు కలిగాయి. మానవ జీవితం కల్లోలం అయింది. అడవిలో చెట్ల పండ్లు తిని బతికే కోతులు ఊళ్లమీద పడ్డాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. వంటింట్లోకి కూడా చొరబడి మన తిండిని కూడా ఎత్తుకుపోతున్నాయి. ఇలాంటి పరిణామాలకు అడవులు, చెట్లు లేకపోవడమే కారణం.

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల పునరుద్ధరణ జరగాలి. గ్రామాల్లో కూడా విరివిగా చెట్లుండాలి. పండ్ల చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నర్సరీల్లో పెంచే మొక్కల్లో 25 శాతం పండ్ల మొక్కలుండాలి. కోతులు, పక్షులు, ఇతర అడవి జంతువులు తినే తునికి, ఎలక్కాయ, మొర్రి, నేరేడు, సీతాఫలం, జామ తదితర పండ్ల మొక్కలను పెద్ద సంఖ్యలో సిద్ధం చేసి పంపిణీ చేయాలి. అడవుల్లో, పొలాల దగ్గర, ఖాళీ ప్రదేశాలలో వాటిని పెంచాలి.

దీనివల్ల కోతులు, ఇతర అడవి జంతువులు జనావాసాల మీద పడకుండా ఉంటాయి. మనుషులు తినే పండ్ల మొక్కలను కూడా సిద్ధం చేస్తే అందరూ తమ ఇళ్లలోనే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ ఎస్‌.కె. జోషి, పంచాయితీరాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top