
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జాప్యం కానున్నాయా.. ఇప్పట్లో నిర్వహణ సాధ్యం కాదా? ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న ప్రచారం ఇది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తుకు తాము సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణ కష్టమేనంటూ సీనియర్ యూనియన్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధమవుతోందని, ఇదే నిజమైతే ప్రభుత్వం మిగిలిన విషయాలపై అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీలో ఎన్నికలు జాప్యం కావచ్చొని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జాప్యం సహజమే...
ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికల్లో జాప్యం జరగడం కొత్తేం కాదు. 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఘన విజయం సాధించి 2013 జనవరిలో గుర్తింపు యూనియన్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఈ లెక్కన 2015 జనవరితో ఈ యూనియన్ పదవీకాలం ముగియాలి. కానీ 2016 జూలై వరకు కొనసాగింది. ప్రస్తుతం టీఎంయూ పదవీకాలం 2018, ఆగస్టు 7 నాటికి ముగిసింది. నిబంధనల ప్రకారం కొత్త యూనియన్ ఎన్నికయ్యే వరకు పాత యూనియనే ఆపద్ధర్మంగా కొనసాగుతుంది. మరోవైపు ఏపీలోనూ గుర్తింపు యూనియన్ పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగిసినా ఈ ఆగస్టులో ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నికలకు యూనియన్ల పట్టు..
ఎన్నికల్లో ఈసారి జాప్యాన్ని సహించేది లేదని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు పలు యూనియన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈయూ, టీజేఎంయూలు లేబర్ కమిషనర్‌కు విన్నవించాయి. గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో ఉన్న నేపథ్యంలో తమకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంటుందని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నాయి.