మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీ-కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం నింపాయి. సాధారణ ఎన్నికల పోలింగ్ సరళిపై బెంబేలెత్తిన పార్టీ నేతలకు తాజా ఫలితాలు ఊరటనిచ్చాయి.
టీ-కాంగ్రెస్‌లో జోష్
May 13 2014 2:32 AM | Updated on Mar 18 2019 9:02 PM
సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీ-కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం నింపాయి. సాధారణ ఎన్నికల పోలింగ్ సరళిపై బెంబేలెత్తిన పార్టీ నేతలకు తాజా ఫలితాలు ఊరటనిచ్చాయి. మెజారిటీ మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. అందులోనూ తెలంగాణలో తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న టీఆర్‌ఎస్‌కు తక్కువ స్థానాలు రావడంతో టీపీసీసీ నాయకుల్లో ఆనందం రెట్టింపైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారిలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల వారు ఎక్కువగా నివసించేది పట్టణాల్లోనే.
అలాంటి చోట ఓటర్లు కాంగ్రెస్ పక్షాన నిలవడం పార్టీ నేతల్లో భరోసా నింపింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు వచ్చినా.. వాటిని అధిగమించి మున్సిపాలిటీల్లో విజయం సాధించడం ఆషామాషీ కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉన్నా... టీఆర్‌ఎస్ గట్టి ప్రచారం చేసుకున్నా పట్టణ ఓటర్లు మాత్రం తమకే మద్దతు తెలపడంతో అసలైన చాంపియన్లుగా తామే నిలిచామని టీ కాంగ్ నేతలు చెబుతున్నారు. సాధారణ ఎన్నికల్లోనూ పట్టణ ఓటర్లు ఇదే రకమైన తీర్పునిస్తారని అభిప్రాయపడుతున్నారు.
పట్టణ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశ
పట్టణ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టడంతో ఈ ప్రాంతాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమనే ధీమా వారిలో కనిపిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన నెలరోజుల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగడంతో ప్రజల ఆలోచనల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశమే లేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి ఒకరు మాట్లాడుతూ.. ‘సాధారణంగా స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలతోపాటు పోటీ చేసే అభ్యర్థులకూ ఓటర్లు ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంటే ఓటేసే పరిస్థితి ఉండదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా పార్టీపై అభిమానం ఉంటే చాలు. మున్సిపల్ ఫలితాలను విశ్లేషిస్తే పట్టణాల్లో కాంగ్రెస్‌కు అందరికంటే మెరుగైన ఫలితాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది’ అని చెప్పారు.
గాంధీభవన్‌లో సంబరాలు..
మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో టీపీసీసీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. గాంధీభవన్ వద్ద బాణసంచా పేల్చి, రంగులు చల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సైతం వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. గాంధీ భవన్ సిబ్బందికి, నేతలు, మీడియా ప్రతినిధులు అందరికీ స్వీట్లు తినిపించారు.
Advertisement
Advertisement