
నవవధువు అనుమానాస్పద మృతి
వివాహమైన వారం రోజులకే ఓ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబీకులే హత్య చేశారని బంధువులు ఆరోపించారు.
బషీరాబాద్: వివాహమైన వారం రోజులకే ఓ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబీకులే హత్య చేశారని బంధువులు ఆరోపించారు. ఈ సంఘటన బషీరాబాద్ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నవల్గ అనుబంధ తౌర్యానాయక్ తండాకు చెందిన పెంట్యానాయక్ యాలాల మండలం బాణాపూర్ తండాకు చెందిన అనూషబాయి(19)ని ఈ నెల 16న వివాహం చేసుకున్నాడు. వి వాహ సమయంలో అనూషబాయి కు టుంబీకులు రూ. 50 వేల నగదు, మూడు తులాల బంగారం కట్నంగా ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపించారు. శనివారం రాత్రి దంపతులు ఇంట్లో పడుకున్నారు. ఆదివారం ఉదయం పెంట్యానాయక్ భార్యను నిద్రలేపగా చలనం లేదు. ఆ మెను పరిశీలించగా అప్పటికే మృతి చెందింది.
సమాచారం అందుకున్న బంధువులు తౌర్యానాయక్ తండాకు చేరుకున్నారు. బంగారం కోసం అనూషబాయిని ఆమె భర్త, కుటుంబీకులే హత్య చేశారని ఆరోపించారు. బషీరాబాద్ పోలీసులు తండాకు చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు అనూషబాయి భర్త పెంట్యానాయక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా పెంట్యానాయక్ గతంలో ఓ మహిళ నుంచి బంగారం చోరీ చేశాడు. కాగా అనూషబాయి చిన్నతనంలోనే తల్లిదండ్రులు బిచ్చిబాయి, బీమ్లానాయక్‌లు మృతిచెందారు. దీంతో ఆమెను సోదరుడు శ్రీను పెంచి పెద్దచేసి వివాహం జరిపించాడు. నవవధువు మృతితో బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.