ఉత్పత్తి సంస్థలతో రెట్టింపు ఆదాయం 

Double income with production companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం పిలుపునకు అనుగుణంగా రైతు ఉత్పత్తి సంస్థలు ప్రోత్సహించేందుకు ఎస్‌ఎఫ్‌ఏసీ, ఫిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమని వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతు సమస్యల పరిష్కారానికి రైతు ఉత్పత్తి కేంద్రాలు(ఎఫ్‌పీవో)లు ఉపయోగపడతాయన్నారు. ఫ్యాప్సీ భవన్‌లో శుక్రవారం ఫిక్కీ , ఏపీఈడీఏ సహకారంతో నిర్వహించిన ‘రెట్టింపు ఆదా యం కోసం రైతు ఉత్పత్తుల సంస్థలు’అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18లో భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషించిందని, దేశ జనాభాలో 55% ప్రజలకు వ్యవసాయం ఉపాధి అవకాశం కల్పిస్తోందన్నారు.

చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులను రైతు ఉత్పత్తి సంస్థలు ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ చేయడం వలన ఆర్థికంగా మరింత లబ్ధి పొందుతారన్నారు.  2019 ఆగస్టు 31 నాటికి 8.82 లక్షల మంది రైతులను రైతు ఉత్పత్తి సంస్థల్లో సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 7.56 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులను గుర్తించి 44,467 ఫార్మర్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్స్‌ (ఎఫ్‌ఐసీ)లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కామతాన్‌ ఫార్క్‌ టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, సీఈవో ప్రవేశ్‌ శర్మ, ఎస్‌ఎఫ్‌ఏసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీల్‌కమల్‌ దర్బారి, ఎస్‌ఎఫ్‌ఏసీ టీం లీడర్‌ రాకేశ్‌ శుక్లా, రైతు ఉత్పత్తి సంస్థలు, పరిశ్రమల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top