
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) పాలకవర్గాలపై వేటు వేయాలని సహకార శాఖ నిర్ణయించినా దాని అమలులో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వేటు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ నెల 17 వరకు నిర్ణయం తీసుకోవడానికి అవకాశముండటంతో వాయిదా పద్ధతిని ఎంచుకు న్నారు. ఆ రెండు పాలకవర్గాలపై అవినీతి అక్రమాలు బయటపడటంతో వాటి అధ్యక్షులు, డైరెక్టర్లను ఇంకా కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) పాలకవర్గాల పదవీకాలం శనివారం ముగిసింది. డీసీ సీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలు (డీసీఎంఎస్), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్(టెస్కాబ్)ల పదవీకాలం ఈ నెల 17 వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ డీసీసీబీలపై వాయిదా వేశారు. మొత్తం 906 ప్యాక్స్‌లలో 90 ప్యాక్స్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. వాటి పాలకవర్గాలను రద్దు చేసి అధికారులను నియమించాలని నిర్ణయించారు. మిగతా సంఘాల చైర్మన్లు పర్సన్ ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు. కొన్ని సంఘాల సభ్యులు సహకార శాఖకు బకాయిపడ్డారు. పాలకవర్గ గడువు తీరడం, మళ్లీ కొనసాగాలంటే బకాయిలు చెల్లించాల్సి రావడంతో అనేకమంది వాటిని తీర్చినట్లు చెబుతు న్నారు. రూ.20 కోట్లకుపైగా బకాయి సొమ్ము తమకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.
మంత్రి పోచారం సమీక్ష...
సహకార శాఖపై మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి పార్థసారథి, సహకారశాఖ కమిషనర్ వీరబ్రహ్మయ్య శని వారం సమీక్ష జరిపారు. జిల్లా సహకార అధికారులతో ఆయన సమావేశమై పలు వివరాలు తీసుకున్నారు. సహకార సంఘాల పదవీ కాలం ముగియడం, పర్సన్ ఇన్‌చార్జుల నియామకం నేపథ్యంలో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.