ఒక ఉరికంబం కావాలి

Department of Prisons was now worried about Execution of hanging - Sakshi

     ముషీరాబాద్‌ జైలుతోపాటే కనుమరుగు

     ఇతర ఏ జైలులోనూ అందుబాటులో లేని వైనం

     చివరిసారిగా 1978లో ఉరిశిక్ష అమలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉగ్రవాదం పేరుతో మారణహోమం సృష్టించిన దోషులకు న్యాయస్థానాలు ఉరిశిక్ష తీర్పు వెల్లడించాయి. అయితే ఈ ఉరిశిక్ష అమలు చేయాల్సిన జైళ్ల శాఖ ఇప్పుడు ఆందోళనలో పడింది. రాష్ట్రంలోని ఏ జైలులో కూడా ఉరికంబాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. తెలంగాణలో ఉరికంబం ఉన్న ఒకే ఒక్క జైలు ముషీరాబాద్‌ జైలు. ఇప్పుడు ఆ జైలు కనుమరుగైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ కేంద్ర కారాగారంలో కూడా ఉరికంబం ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర కారాగారాల్లో ఉన్న ఏడుగురు దోషులకు ఉరిశిక్ష పడింది. వీరికి ఉరివెయ్యాలంటే ఉరికంబం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది.  

1978లో చివరి ఉరి... 
ప్రస్తుతం రాష్ట్రంలో చర్లపల్లి, చంచల్‌గూడ, వరంగల్‌ జైళ్లు కేంద్ర కారాగారాలుగా ఉన్నాయి. వీటిలో ఎక్కడా కూడా ఉరికంబం అందుబాటులో లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర కారాగారంగా ఉన్న ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలోనే ఉరికంబం ఉండేది. రాజమండ్రి జైల్లో 1976లో కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. అదేవిధంగా ముషీరాబాద్‌లో 1978లో మరో ఖైదీని ఉరితీశారు. ఇదే జైళ్ల శాఖలో చివరి ఉరిగా చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో ఉరిశిక్ష పడుతున్నా ఉరి మాత్రం అమలు కాలేదని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం గోకుల్‌చాట్, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో ముద్దాయిలుగా మొత్తం ఏడుగురికి ఉరిశిక్ష వేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడు ఉరికంబం విషయం చర్చనీయాంశంగా మారింది.  

ఎక్కడ ఏర్పాటు చేయాలి.. 
పేలుళ్ల కేసుల్లో దోషులు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఉరి అమలు చేయాల్సింది రాష్ట్ర జైళ్ల శాఖే కావడంతో తప్పనిసరిగా ఉరికంబాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం జైళ్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలోని మూడు కేంద్ర కారాగారాల్లో ఏ జైల్లో ఉరికంబం ఏర్పాటు చేయాలన్న దానిపై సందిగ్ధం ఏర్పడింది. సున్నితమైన కేసుల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీలకు నగరంలోని కేంద్ర కారాగారాల్లో శిక్ష అమలుచేస్తే ఇబ్బందికర పరిస్థితులుంటాయని, అందువల్ల వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో ఏర్పాటుచేస్తే బాగుంటుందని జైళ్ల శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉరికంబం ఏర్పాటు ప్రతిపాదనపై త్వరలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే స్పష్టత వస్తుందని జైళ్ల శాఖ అధికారులు స్పష్టంచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top