ప్రైవేటు ఆస్పత్రులపైనా డెంగీ అదుపు బాధ్యతలు 

Dengue prevention responsibilities also to private hospitals - Sakshi

తక్షణమే స్పందించాలని హైకోర్టు హితవు

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ వంటి రోగాల బారిన జనం పడినప్పుడు ప్రభుత్వాస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా యుద్ధప్రాతిపదికపై రోగులకు వైద్య సేవలు అందించాలని హైకోర్టు సూచించింది. ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేసే బాధ్యత ప్రభుత్వంపై మాత్రమే ఉందనుకోరాదని, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా మానవీయకోణంలో స్పందించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. డెంగీ వంటి రోగాలతో జనం నానాకష్టాలుపడుతున్నారని, ప్రభుత్వ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొంటూ కొంపల్లి ప్రాంతానికి చెందిన వైద్యురాలు ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి ధర్మాసనం శనివారం విచారించింది.

డెంగీ, ఇతర జ్వరాలతో బాధపడే రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయని, పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పటి వరకూ 60 డెంగీ కేసులు నమోదయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడం కష్టమవుతున్న తరుణంలో ప్రైవేటు ఆస్పత్రులు తక్షణమే స్పందించి ఆ రోగాల్ని కనీస స్థాయికి తగ్గించేందుకు కృషి చేయాలని హైకోర్టు హితవు చెప్పింది. దోమలు వ్యాప్తి కాకుండా జీహెచ్‌ఎంసీ ఫాగింగ్‌ స్ప్రే చేస్తోందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పారు. పూర్తి వివరాల్ని అందించేందుకు సమయం కావాలని కోరడంతో విచారణ 11కి వాయిదా పడింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top